ఆడపిల్లకు కరాటే ఆయుధం కావాలి : ఎంపీ డీకే అరుణ

ఆడపిల్లకు కరాటే ఆయుధం కావాలి : ఎంపీ డీకే అరుణ

పాలమూరు, వెలుగు: ఆడపిల్లల ఆత్మ రక్షణకు  కరాటే ఆయుధం కావాలని మహబూబ్ నగర్  ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఆదివారం మహబూబ్​నగర్  ఇండోర్  స్టేడియంలో రాష్ట్ర స్థాయి  కరాటే చాంపియన్​షిప్  పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు కేంద్రం అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. 

జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించేందుకు మరింత ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. ఆత్మ రక్షణకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఆడపిల్ల కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాస్టర్  రవికుమార్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పద్మజా రెడ్డి పాల్గొన్నారు.