
పాలమూరు, వెలుగు: పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంతో అవసరమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. గురువారం సుషీనా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ల్యాక్టేషన్ నిర్వహణ కేంద్రం, మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పుట్టిన పిల్లలకు తల్లి పాలు ఇవ్వకపోవడంతో రోగ నిరోధకశక్తిని కోల్పోతున్నారని చెప్పారు.
భవిష్యత్తు లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని కోరారు. బరువు తక్కువగా పుట్టిన వారికి, నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలకు మదర్స్ మిల్క్ బ్యాంక్ వరం లాంటిదని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మిగిలిన జనరల్ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేయాలని కోరారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ సంపత్ కుమార్ సింగ్, బెజ్జుగం రాఘవేందర్, శామ్యూల్, పెగ విశ్వేశ్వరయ్య, పెగ ధరణికోట, రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి చర్యలు
హన్వాడ: గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండలంలోని టంకర, వేపూర్ గ్రామాల్లో రూ.44.50 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ ను ఎండీ డీకే అరుణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రోడ్లు, రవాణా, కమ్యునికేషన్, ఆరోగ్య సదుపాయాలు, విద్యాసంస్థలు, విద్యుత్ ఏర్పాటు వంటివి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాలమూరు నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. లైబ్రరీ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రీ, మహేందర్, టంకర కృష్ణయ్య యాదవ్, అచ్చెన్న, రామకృష్ణ పాల్గొన్నారు.