![కాంగ్రెస్ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది : ఎంపీ డీకే అరుణ](https://static.v6velugu.com/uploads/2025/02/mp-dk-aruna-makes-comments-that-congress-party-has-lost-the-trust-of-people_7ZdoUXLjuQ.jpg)
పాలమూరు, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయిందని, ఢిల్లీలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాకపోవడం ఇందుకు నిదర్శనమని పాలమూరు ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ పూర్తిగా విఫలమయ్యారని, ఇక కాంగ్రెస్ పని అయిపోయినట్లేనని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమని చెప్పారు. పదేండ్ల ఆప్ పాలనలో ఢిల్లీ అధ్వానంగా తయారైందని తెలిపారు.
ఎన్నికల కోసం కేసీఆర్ మాదిరిగానే రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెబితేనే పథకాలు అమలవుతాయని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన నిధులతో నిర్మించిన ఇండ్లకు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే సహించేది లేదన్నారు. దేశంలో అన్నివర్గాలకు లబ్ధి చేకూరేలా బడ్జెట్ ప్రవేశపెట్టారని, రూ.12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పద్మజా రెడ్డి, రాములు, విష్ణువర్ధన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, పాండురంగారెడ్డి, అచ్చుగట్ల అంజయ్య పాల్గొన్నారు.