మహబూబ్​నగర్​లోని జనరల్ హాస్పిటల్​ను బెస్ట్​ హాస్పిటల్​గా తీర్చిదిద్దుతాం : ​ ఎంపీ డీకే అరుణ

మహబూబ్​నగర్​లోని జనరల్ హాస్పిటల్​ను బెస్ట్​ హాస్పిటల్​గా తీర్చిదిద్దుతాం : ​ ఎంపీ డీకే అరుణ

పాలమూరు/హన్వాడ, వెలుగు: రానున్న నాలుగేండ్లలో మహబూబ్​నగర్​లోని జనరల్​ హాస్పిటల్​ను ది బెస్ట్​ హాస్పిటల్​గా తీర్చిదిద్దుతామని పాలమూరు ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డితో కలిసి బుధవారం ఆమె హాస్పిటల్​ డెవలప్​మెంట్​ మీటింగ్​లో పాల్గొన్నారు. అంతకుముందు ఎంపీ, ఎమ్మెల్యే హాస్పిటల్​లో రేడియాలజీ హబ్, మాతా శిశు విభాగం(ఎంసీహెచ్) వార్డు, ఈఎన్టీ ఆపరేషన్  థియేటర్, ఓటీ కాంప్లెక్స్ ను ప్రారంభించారు.

సమగ్ర శిక్ష అభియాన్  స్కీం కింద రూ.8.26 కోట్లతో డైట్  కాలేజీ​వద్ద కొత్త బిల్డింగ్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హన్వాడ మండలం లింగన్నపల్లిలో రూ.20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్​ ఫండ్స్​తో నిర్మించనున్న జీపీ బిల్డింగ్​కు భూమిపూజ చేశారు. గొండ్యాల జడ్పీ హైస్కూల్​లో కొత్తగా నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. మునిమోక్షం జడ్పీ హైస్కూల్​లో రూ.2 లక్షలతో టాయిలెట్స్  నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ త్వరలో హాస్పిటల్​లో సోలార్​ లైట్లు, అదనంగా ఒక అంబులెన్స్​ను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు.

హాస్పిటల్​ను డెవలప్​ చేసేందుకు ఎంపీ, ఎమ్మెల్యే ఫండ్స్​ సరిపోవని, కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. పాలమూరు హాస్పిటల్​ అభివృద్ధి బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ పార్టీలు ఏవైనా, పార్టీలకు అతీతంగా రెట్టించిన ఉత్సాహంతో పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

పాలమూరు హాస్పిటల్​లో అత్యవసర పనులు నిమిత్తం రూ.10 లక్షల నిధులు అందజేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. కలెక్టర్  విజయేందిర బోయి, ముడా చైర్మన్  లక్ష్మణ్  యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  మల్లు నర్సింహారెడ్డి, మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, మార్కెట్  కమిటీ చైర్మన్  బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్  చైర్మన్  పెద్ద విజయ్ కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, డీఎంహెచ్​వో కృష్ణ, సూపరింటెండెంట్​ సంపత్​ కుమార్​ సింగ్  పాల్గొన్నారు.