పల్లాకు పరీక్ష..!..గులాబీ శ్రేణుల్లో కనిపించని జోష్​

  • జనగామ ఎమ్మెల్యేకు ఎంపీ ఎలక్షన్ టెన్షన్​
  • అసెంబ్లీ మెజార్టీ కోసం ఆరాటం
  • గులాబీ శ్రేణుల్లో కనిపించని జోష్​

జనగామ, వెలుగు : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డికి భువనగిరి ఎంపీ ఎలక్షన్లు పరీక్షగా మారాయి. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనగామ మాత్రమే బీఆర్​ఎస్ ఖాతాలో ఉంది. కాంగ్రెస్​ సర్కార్​ఏర్పడిన తర్వాత బీఆర్​ఎస్ ప్రజాప్రతినిధులు, లీడర్లు ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల అసెంబ్లీ ఎలక్షన్లలో తనకు వచ్చిన మెజార్టీని కాపాడుకోవడం ఎమ్మెల్యేకు సవాల్​గా మారింది.  

పల్లాకు సవాల్..​

బీఆర్​ఎస్​ను వీడుతున్న క్యాడర్​ను కాపాడుకోవడం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డికి సవాల్​గా మారింది. అసెంబ్లీ ఎలక్షన్​లో కేసీఆర్​కు అత్యంత సన్నిహితుడిగా పదే పదే జనాన్ని నమ్మించడంతో కాంగ్రెస్ వేవ్ లోనూ జనం పల్లాను గెలిపించారు. ఇటీవలి స్టేషన్​ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్​ఎస్ ను వీడితే ఆ నియోజకవర్గ బాధ్యతలు కూడా పల్లాకే అప్పగించారు. ప్రస్తుతం బీఆర్​ఎస్ లో కీలక వ్యక్తిగా ఉన్న పల్లాకు జనగామలోని పరిస్థితులు మాత్రం సంకటంగా మారాయి. ఇప్పటికే జనగామ జడ్పీటీసీతో పాటు, ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్ లో చేరారు.

మరో పది మంది బీఆర్​ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ తో టచ్​లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరే కాకుండా లీడర్లు, క్యాడర్​ కొన్ని రోజులుగా డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్​రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరుతూ వస్తున్నారు. దీంతో ఉనికిని కాపాడుకునేందుకు పల్లా ఆరాట పడుతున్నారు. కనీసం తనకు వచ్చిన 15 వేల మెజార్టీ అయినా ఇవ్వాలనే పట్టుదలతో నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.  

సీన్​ రిపీట్​ కానుందా..?

కాంగ్రెస్​ గాలి వీస్తున్నందున గత ఎన్నికల సీన్ రిపీట్​ కానుందా అనే అనుమానాలను బీఆర్​ఎస్ క్యాడర్ వ్యక్తం చేస్తోంది. 2019 ఎంపీ ఎలక్షన్​ టైంలో బీఆర్​ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండగా, అప్పటి అసెంబ్లీ ఎలక్షన్​లో ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తిరెడ్డికి 29,568 ఓట్ల మెజార్టీ వస్తే ఎంపీ ఎలక్షన్లలో భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్​కు కేవలం 5,836 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో ఉంది. పైగా బీఆర్​ఎస్​ ఎదుర్కొంటున్న అవినీతి, ఆరోపణల నేపథ్యంలో పల్లా రాజేశ్వర్​రెడ్డికి వచ్చిన 15,783 ఓట్ల​మెజార్టీ ఇప్పుడు మళ్లీ సాధించడం కష్టమే అన్న వాదనలు ఉన్నాయి. 

జనగామ మెజార్టీ తగ్గకుండా ఉంటే తానే గెలిచేవాడినని అప్పట్లో బూర నర్సయ్య అలక బూని బీఆర్​ఎస్ ను వీడిన సంగతి విదితమే. కాగా, రాష్ర్టం ఏర్పాటు తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు పట్టం కడుతూ వస్తున్నా 2018 ఎన్నికల నుంచి మెజార్టీ తగ్గుతూ వస్తుండడంతో ఈ ఎఫెక్ట్​ ఎంపీ ఎన్నికలపై పడనుందని బీఆర్​ఎస్​ ఆందోళన చెందుతోంది.