బీఆర్ఎస్‌లో ఎంపీ ఎన్నికల టెన్షన్! 

  • అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ
  • ఎంపీగా పోటీ చేయాలనుకునే ఆశవాహుల్లో మొదలైన గుబులు
  • పునరాలోచనలో పడ్డ మండలి చైర్మన్​ గుత్తా, ఆయన కొడుకు అమిత్ రెడ్డి
  • భువనగిరి పార్లమెంట్ పరిధిలోనూ ఇదే పరిస్థితి  

నల్గొండ, వెలుగు : బీఆర్​ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల భయం పట్టుకుంది.  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ రావడంతో ఆశావహులు డైలామాలో పడ్డారు.  నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాల పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో 12 చోట్ల కాంగ్రెస్​అభ్యర్థులు బంపర్ మెజార్టీ సాధించారు.   జనగామ, సూర్యాపేటలో మాత్రమే బీఆర్ఎస్​ గెలిచింది.  జనగామలో పల్లా రాజేశ్వరెడ్డి 15 వేల మెజార్టీతో గెలిస్తే, సూర్యాపేటలో మాజీ మంత్రి జి.జగదీశ్​ రెడ్డి కేవలం 4,606 ఓట్లతో గట్టెక్కారు.  దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంపీగా పోటీ చేయాలని భావించిన సీనియర్లు సైతం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. 

2018లో అసెంబ్లీ ఎన్నికల్ల సత్తా చాటినా.. 

2018 అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు కలుపుకొని బీఆర్​ఎస్​ 11 చోట్ల గెలిచింది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ మారాక బీఆర్ఎస్​ బలం12కు చేరినప్పటికీ.. ఎంపీ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. నల్గొండ, భువనగిరి స్థానాలను కాంగ్రెస్​ కైవసం చేసుకోవడంతో పార్టీకి​ గట్టిషాక్​ తగిలింది.  అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్లు, ఎమ్మెల్యేలు ఎంపీ ఎన్నికలను సీరియస్​గా పట్టించుకోకపోవడం వంటి కారణాలతో బీఆర్ఎస్​ క్యాండేంట్లు ఓటమిపాలయ్యారు.  రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ భువనగిరిలో ఒకసారి గెలిచినా..  నల్గొండలో మాత్రం బీఆర్ఎస్ బోణీ  కొట్టలేకపోయింది. 

పరేషాన్​లో సీనియర్​ నేతలు 

ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన సీనియర్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూశాక పరేషాన్​లో పడ్డారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​ రెడ్డి ఎమ్మెల్యేల వైఖరి కారణంగా పార్టీ నష్టపోయిందనే విషయాన్ని బాహాటంగానే ప్రకటించారు. హైకమాండ్​ఆదేశిస్తే నల్గొండ ఎంపీ స్థానానికి తాను లేదంటే తన కొడుకు అమిత్​ రెడ్డి పోటీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించారు. కానీ, సూర్యాపేట మినహా, మిగిలిన ఆరు చోట్ల కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలిచారు.

పైగా, ఈ స్థానం నుంచి పోటీ చేస్తానని కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి ఇటీవల ప్రకటించారు. దీంతో సుఖేందర్‌‌ రెడ్డి పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. గతంలో ఇదే స్థానం నుంచి ఆయన కాంగ్రెస్​ తరఫున రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు.  ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్​లో చేరారు. 2019 ఎంపీ  ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌  వేమిరెడ్డి నర్సింహారెడ్డి అనే కొత్త వ్యక్తిని బరిలో దింపి విఫలమైంది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఎంపీగా గెలిచారు.   

భువనగిరి రేసులో బీసీలు ...? 

భువనగిరి ఎంపీ స్థానాన్ని బీఆర్‌‌ఎస్‌ గత రెండు సార్లు బీసీకే ఇవ్వడంతో ఈ సారి కూడా అదే ఫార్ములా అమలు చేయనుందని ప్రచారం ఉంది.  ఈ మేరకు బీసీ నేతలు ప్రయత్నాలు కూడా చేసుకున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ నుంచి బీఆర్​ఎస్​లో చేరిన పొన్నాల లక్ష్మయ్య, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఈ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, జనగామ మినహా ఆరుచోట్ల కాంగ్రెస్​ క్యాండేట్లు భారీ మెజార్టీ సాధించడంతో వారు డైలమాలో పడ్డారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్​ నుంచి ఎంపీగా గెలిచిన బూర నర్స య్యగౌడ్​ 2019లో ఓడిపోయారు. 2018లో నల్గొండలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా గెలిచారు.

అయితే ఈసారి బీసీ అభ్యర్థికే అవకాశం ఇస్తారా? లేకపోతే కాంగ్రెస్ తరహాలో రెండు సీట్లు రెడ్లకే కేటాయిస్తారా..? అనే దానిపై చర్చ జరుగుతోంది.  రెడ్లకే ఇవ్వాల్సి వస్తే ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన ఇద్దరు అభ్యర్థుల పేర్లు ప్రము ఖంగా వినిపిస్తున్నాయి.  గుటాటి వర్గానికి చెందిన భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్​ రెడ్డి, మటాటి వర్గానికి చెందిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే సునీత భర్త మహేందర్​ రెడ్డి  పేర్లను  హైకమాండ్ పరిశీలించే అవకాశం ఉందని సీనియర్లు చెపుతున్నారు.