నవోదయ స్కూల్​ను తరలించొద్దు : ఎంపీ వంశీకృష్ణ

నవోదయ స్కూల్​ను తరలించొద్దు : ఎంపీ వంశీకృష్ణ
  • ధర్మపురిలోని నేరెళ్లలోనే ఏర్పాటు చేయండి
  • స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటది
  • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​కు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: ధర్మపురి నియోజకవర్గంలోని నేరెళ్ల గ్రామానికి కేటాయించిన నవోదయ విద్యాలయాన్ని అక్కడే కొనసాగించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం పార్లమెంటులో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ను ఆయన చాంబర్​లో కలిశారు. నేరెళ్ల గ్రామంలోనే నవోదయ విద్యాలయాన్ని కొనసాగించాలని కోరుతూ.. స్థానికులకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

అనంతరం పార్లమెంట్ ఆవరణలో విప్ లక్ష్మణ్ తో కలిసి మీడియాతో వంశీకృష్ణ మాట్లాడారు. ‘‘ధర్మపురిలోని నేరెళ్ల గ్రామానికి కేంద్రం నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది. ఈ ఏరియాలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉంది. ఈ స్కూల్​తో వారి జీవితాల్లో మార్పులు వస్తాయి. అయితే, ఈ విద్యాలయం ఏర్పాటు విషయంలో కేంద్రం పునరాలోచన చేస్తున్నట్లు తెలిసింది. వేరే ప్రాంతానికి తరలించే ఏర్పాటు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది.  ఈ నేపథ్యంలో నవోదయ విద్యాలయాన్ని నేరెళ్లలోనే కొనసాగించాలని కేంద్ర మంత్రిని కోరినం’’ అని వంశీ కృష్ణ తెలిపారు.

కేంద్రం ప్రతిపాదనలు కోరితే పంపించినం: విప్ అడ్లూరి

తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదనలు కోరిందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ‘‘ధర్మపురిలోని నేరెళ్లలో నవోదయ విద్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అలాగే, 30 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించినం. నవోదయ విద్యాలయ కమిటీ.. నేరెళ్ల గ్రామానికి నవోదయ విద్యాలయ నోటిఫికేషన్ ఇచ్చింది. నవోదయ స్టేట్ కో ఆర్డినేటర్లు తరగతుల కోసం తాత్కాలిక బిల్డింగ్​ను చూశారు. అయితే, ఈ నవోదయ విద్యాలయాన్ని నిలుపుదల చేస్తున్నట్లు తెలిసింది’’అని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.

భూ నిర్వాసితులకు న్యాయం చేయండి .. బాధితులకు ఉద్యోగావకాశాలు కల్పించండి: ఎంపీ వంశీకృష్ణ

రామగుండంలోని ఎన్టీపీసీ ప్లాంట్ విస్తరణలో భాగంగా భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ ప్లాంట్ విస్తరణలో భూములు కోల్పోతున్న మాతంగి కాలనీ వాసుల సమస్యలను మంగళవారం లోక్ సభ జీరో అవర్ లో ఎంపీ వంశీకృష్ణ లేవనెత్తారు. బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటూ మరో ప్రాంతానికి వెళ్తున్నారని సభ దృష్టికి తెచ్చారు. భూములు కోల్పోతున్న వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేశారు. 

ఈ విషయంలో బాధితులకు న్యాయం చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని డిమాండ్ చేశారు. విలువైన భూములు అందిస్తున్న నిర్వాసితులకు ప్రాజెక్ట్ లో ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం ముందుకొస్తున్నప్పటికీ.. ఉద్యోగాల్లో పెద్దపల్లి, రామగుండ వాసులకు సరైన అవకాశం దొరకడం లేదన్నారు. అలాగే.. ప్రభావిత, పునరావాస ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించి, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

పెద్దపల్లిలో సెజ్ ప్రతిపాదన లేదు .. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

తెలంగాణలోని పెద్దపల్లిలో తయారీ, టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశ్రమల స్థాపన కోసం స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఏర్పాటు ప్రతిపాదన లేదని కేంద్రం వెల్లడించింది. మంగళవారం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రసాద్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. సెజ్​లను  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఏ వ్యక్తి అయినా సంయుక్తంగా లేదా ప్రత్యేకంగా స్థాపించవచ్చని చెప్పారు. పెద్దపల్లిలో తయారీ, టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పరిశ్రమల స్థాపన కోసం సెజ్ ఏర్పాటు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి అందలేదని సమాధానంలో పొందుపరిచారు.