సింగరేణి రిటైర్డ్ కార్మికుల పింఛన్ 10 వేలకు పెంచాలి : గడ్డం వంశీకృష్ణ

సింగరేణి రిటైర్డ్ కార్మికుల పింఛన్ 10 వేలకు పెంచాలి : గడ్డం వంశీకృష్ణ

న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణి రిటైర్డ్‌‌‌‌ కార్మికుల పింఛన్‌‌‌‌ను రూ.10 వేలకు పెంచాలని పెద్దపల్లి కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్‌‌‌‌ చేశారు. కేంద్ర మాజీ కార్మిక శాఖ మంత్రిగా కాకా (గడ్డం వెంకటస్వామి) సింగరేణి రిటైర్డ్ కార్మికుల కోసం ఈ పింఛన్ విధానాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఈ స్కీం కింద రిటైర్డ్ ఉద్యోగులకు ఆయన రూ.1,500 పింఛన్ కల్పించారన్నారు. ఈ స్కీం ప్రవేశపెట్టి 35 ఏండ్లు దాటినా.. ఇప్పటికీ రూ.1,500 పింఛన్‌‌‌‌గా ఇవ్వడం బాధాకరమన్నారు. 

బుధవారం లోక్‌‌‌‌సభలో పబ్లిక్ ఇంపార్టెన్స్ కింద సింగరేణి కార్మికుల పింఛన్ అంశాన్ని ఎంపీ వంశీకృష్ణ లేవనెత్తారు. ఈ విషయంలో న్యాయం కోసం పోరాటం చేస్తామని వివరించారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు భాగమయ్యారని గుర్తుచేశారు.  రూ.1,500 పింఛన్‌‌‌‌ డబ్బులకు ఒక బియ్యం బస్తా కూడా రాదని, రోగం వచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్తే ఈ డబ్బులు ఏం సరిపోతాయని ప్రశ్నించారు. అందుకే పింఛన్‌‌‌‌ మొత్తాన్ని పెంచాలని ఆయన కోరారు.