- దేశప్రజలకు క్షమాపణ చెప్పే వరకు ఆయన్ను వదిలిపెట్టం: ఎంపీ వంశీకృష్ణ
- పార్లమెంట్‌లో బీజేపీ వాళ్లే రాహుల్‌పై దాడి చేసి డ్రామాలాడారని మండిపాటు
- రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపణ
- మంచిర్యాల, పెద్దపల్లి, గోదావరిఖనిలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ
కోల్‌బెల్ట్/మంచిర్యాల/గోదావరిఖని,వెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను అవమానించడం సిగ్గు చేటని, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే యావత్ భారతదేశానికి క్షమాపణలు చెప్పి, మంత్రి పదవికి రాజీనామా చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా, మందమర్రి మార్కెట్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, ధర్మారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దళిత సంఘాల లీడర్లతో కలిసి వంశీకృష్ణ పూల మాలలు వేశారు.
అలాగే, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్, కాకా వెంకటస్వామి విగ్రహాలకు, గోదావరిఖనిలోని టీ-జంక్షన్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. మందమర్రిలో, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘అంబేద్కర్ కేవలం రాజ్యాంగ శిల్పి మాత్రమే కాదు.. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసిన మహానేత. దళితులు కోసం నిరంతరం తపించిన ఆ మహానీయుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ అమిత్ షా అక్కసు వెళ్లగక్కారు. ఇది దేశ ప్రజాస్వామ్య భావాలను అవమానించడమే అవుతుంది. దళితులు, బడుగు, బలహీన వర్గాలంటే బీజేపీకి నచ్చదు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుంది”అని వంశీ పేర్కొన్నారు.
హోం మంత్రిగా అమిత్ షా ఫెయిల్..
అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు ఆవరణలో నిరసన చేస్తే ఆదివాసీ ఎంపీపై రాహుల్ గాంధీ దాడి చేశారని బీజేపీ నేతలు డ్రామా క్రియేట్ చేశారని వంశీకృష్ణ అన్నారు. క్రియేటివ్ జీనియస్‌లు, యాక్టర్లంతా బీజేపీలోనే ఉన్నారని, అయినా భారత్‌కు ఆస్కార్ అవార్డులు ఎందుకు రావడం లేదని సెటైర్ వేశారు. మణిపూర్ మారణకాండ, సంభాల్‌లో మత ఘర్షణలపై కేంద్ర హోం మంత్రి కనీస స్పందన లేదన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, వారి కుట్రలను కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు. దళితులపై అమిత్ షాకు ఎంత కక్ష ఉందో ఆయన ప్రసంగంలో తెలుస్తన్నదని పేర్కొన్నారు.
ఎన్నికల ముందు బీజేపీ నిజ స్వరూపం బయటపడుంటే ఎంపీ ఎన్నికల్లో 240 సీట్లు కూడా వచ్చేవి కావన్నారు. ఒకే పార్టీ ఒకే లీడర్ ప్రయత్నంలో భాగంగా బీజేపీ తీసుకొస్తున్న ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అమిత్ షా క్షమాపణ చేప్పే వరకు ఈ ఇష్యూను వదిలిపెట్టబోమన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన చేసి, దళితుల గౌరవాన్ని, అంబేద్కర్ ప్రతిష్టను కాపాడటానికి కాంగ్రెస్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అమిత్ షాపై ఎంపీ వంశీకృష్ణ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతి పత్రం అందజేశారు. మరోవైపు, తమ డిమాండ్లను పరిష్కరించాలని మంచిర్యాల కలెక్టరేట్‌లో సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు మంగళవారం ఎంపీ వంశీకృష్ణను కలిశారు. ఈ మేరకు ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానని వంశీ వారికి హామీ ఇచ్చారు.
అంబేద్కర్‌పై ప్రేమ ఉన్నట్లు మోదీ నాటకం..
అంబేద్కర్‌ను అవమానించేలా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చర్యలు తీసుకోకుండా ప్రధాని మోదీ అంబేద్కర్ మీద ప్రేమ ఉన్నట్లు ట్వీట్లు చేస్తున్నారని వంశీకృష్ణ విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు 3 వేల ఏండ్లుగా పడ్డ ఇబ్బందులను గుర్తించి రాజ్యాంగంలో అంబేద్కర్ వారికి రిజర్వేషన్లుకల్పించారని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ పత్రికల్లో నిత్యం అంబేద్కర్‌ను విమర్శలు చేస్తూ ఉంటారని గుర్తుచేశారు. అలాగే, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఫూలే, అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించారు.
ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం, ఆలయ ఫౌండేషన్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయా సంఘాల ప్రతినిధులు తెలిపారు. మరోవైపు, పెద్దపల్లిలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని, జిల్లాలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలకు తనకు సమాచారం ఇవ్వడం లేదని వంశీకృష్ణ అన్నారు.
అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లలో కాకా వెంకటస్వామి వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తే.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్‌లో కాకా వర్ధంతిని నిర్వహించకపోవడంపై ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు.