అదానీ లంచాలపై పార్లమెంట్​లో చర్చ జరగాల్సిందే : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

అదానీ లంచాలపై పార్లమెంట్​లో చర్చ జరగాల్సిందే : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 

  • కేంద్రం కావాలనే తప్పించుకుంటున్నది: ఎంపీ వంశీకృష్ణ
  • ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను స్పీకర్ పట్టించుకోకపోవడం ఏమిటి?
  • ప్రజలకు వివరాలు తెలియాల్సిందే
  • బీజేపీకి సంబంధం లేకపోతే వెంటనే  ఎంక్వైరీ చేయించాలని డిమాండ్​

న్యూఢిల్లీ, వెలుగు: అదానీ లంచాల వ్యవహారంపై పార్లమెంట్​లో కాంగ్రెస్ పార్టీ చర్చకు పట్టుబడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ  కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ ప్రతి రోజు తిరస్కరిస్తున్నారని ఆయన అన్నారు. ఇది నిజంగా బాధాకరమైన, దురదృష్టకరమైన విషయమని తెలిపారు. గురువారం లోక్ సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంట్ ఆవరణలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ అధికారులకు అదానీ రూ. 2,500 కోట్ల లంచాలు ఇచ్చి.. ఏపీ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి రూ. 50 వేల కోట్ల కాంట్రాక్ట్ లు దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు. అయితే ప్రతిపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుబడితే.. స్పీకర్  కూడా కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా సభను వాయిదా వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ఈ అవినీతి అంశంపై పార్లమెంట్​లో చర్చ జరగాల్సిందేనని డిమాండ్​ చేశారు.

అసలు అదానీ సంస్థ ఇంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగిందని ప్రజలు ఆలోచిస్తున్న టైంలో సౌర విద్యుత్ కాంట్రాక్ట్ లు పొందడం కోసం లంచాలు ఇచ్చారన్న ఆరోపణలతో అదానీకి  అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ ఈసీ) సమన్లు పంపిందని గుర్తుచేశారు. లంచాలు తీసుకున్న అధికారులు, కాంట్రాక్ట్ లు దక్కించుకున్న సంస్థల వివరాలు దేశ ప్రజలకు తెలియాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. లంచాలు ఇచ్చి అదానీ ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన విషయాన్ని ఇప్పటికైనా ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. 

Also Read : నాగర్​కర్నూల్​ జిల్లాలో తేలిన వడ్ల లెక్క .. రూ.142 కోట్ల సీఎంఆర్​ బకాయిలు

సెబీ ఎందుకు సైలెంట్ గా ఉంది?

అదానీ వ్యవహారంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) కూడా ఎందుకు మౌనంగా ఉందని ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నించారు. దేశంలో అవినీతి, లంచాలు లేకుండా పారదర్శకమైన వ్యాపారం, కాంట్రాక్ట్ లు దక్కడంలో సెబీ కీలక పాత్ర పోషిస్తుందని.. కానీ దేశంలో లంచాలు ఇచ్చి సుమారు రూ. 50 వేల కోట్ల కాంట్రాక్ట్ లను అదానీ దక్కించుకుంటే సెబీ తన కర్తవ్యాన్ని ఏమాత్రం చిత్తశుద్ధితో నిర్వర్తించడం లేదనే విషయం స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. నిజంగా అదానీ వ్యవహారంతో కేంద్రంలోని బీజేపీకి సంబంధం లేకపోతే, వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ డిమాండ్ చేశారు.