అమిత్ షా రిజైన్​ చేయాలి .. అంబేద్కర్​ను అవమానించడాన్ని ఖండిస్తున్నం: ఎంపీ వంశీకృష్ణ

అమిత్ షా రిజైన్​ చేయాలి .. అంబేద్కర్​ను అవమానించడాన్ని ఖండిస్తున్నం: ఎంపీ వంశీకృష్ణ
  • రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నరు
  • దళితుల దైవం.. అంబేద్కర్ అనిఅమిత్​షాకు తెలీదా?
  • దేశం మొత్తానికి క్షమాపణచెప్పాలని డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్​ను ఉద్దేశిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం.. దళితులకు రక్షణ కవచమని తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘3వేల ఏండ్ల నుంచి దళితులు అంటరానితనాన్ని అనుభవించారు. ఈ పరిస్థితుల్ని గమనించి 70 ఏండ్ల కింద రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించారు. 

దళితులకు హక్కులు, సమానత్వం కల్పించారు. అలాంటి రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నది. రాజ్యాంగ దినోత్సవంపై రాజ్యసభలో జరిగిన చర్చలో భాగంగా అంబేద్కర్​ను అమిత్ షా కించపర్చేలా కామెంట్లు చేశారు. అంబేద్కర్​కు బదులు దేవుడిని స్మరిస్తే ఏడు జన్మల పుణ్యం వస్తదని అమిత్ షా అవమానించారు. దేశవ్యాప్తంగా ఉన్న 25 శాతం దళితులకు, వెనుకబడిన వర్గాలకు అంబేద్కర్.. ఓ దేవుడనే విషయాన్ని అమిత్ షా తెలుసుకోవాలి. ఓ సామాజిక వర్గాన్ని కించపర్చిన అమిత్​షాకు కేంద్ర మంత్రిగా కొనసాగే అర్హత లేదు’’అని వంశీకృష్ణ మండిపడ్డారు.

దళితులంతా ఏకమవ్వాలి

అమిత్ షా.. మతి భ్రమించి, సిగ్గులేకుండా మాట్లాడారని ఎంపీ వంశీకృష్ణ మండిపడ్డారు. ఇలాంటి సంకుచిత మనస్తత్వంతో మాట్లాడే వ్యక్తి దేశానికి హోంమంత్రిగా ఉండటం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే జైలుకు వెళ్లొచ్చిన రోజులు మళ్లీ గుర్తు చేసుకోవాల్సి వస్తదని హెచ్చరించారు. దళితులంతా ఏకమై చెంపపెట్టులాంటి సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా అంబేద్కర్ స్థాపించారని గుర్తు చేశారు.

ఐదేండ్ల ప్రభుత్వాలను కూల్చే కుట్ర

జమిలి పేరుతో సామాన్యులకు రాజ్యాంగం అందించిన ఓటు హక్కును బీజేపీ కాలరాసే కుట్ర చేస్తున్నదని ఎంపీ వంశీకృష్ణ మండిపడ్డారు. ‘‘ఐదేండ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ చూస్తున్నది. అందుకే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నది. ఎన్డీయే సర్కార్ కుటిల నీతిని, బిల్లుల వెనుక ఉన్న పరమార్థాన్ని ప్రజలు తెలుసుకోవాలి. అంబేద్కర్​పై అమిత్ షా కామెంట్స్​కు వ్యతిరేకంగా దళిత వర్గాన్ని చైతన్య పరుస్తాం. బడుగు, బలహీన వర్గాలు, దళిత ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతాం’’అని వంశీకృష్ణ అన్నారు.

ఎన్నికల ప్రచారంలోనే చెప్పినం

లోక్​సభ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా వస్తే.. రాజ్యాంగాన్ని బీజేపీ మార్చేస్తదని ఎన్నికల ప్రచారంలో వివరించామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ఆ దిశగానే వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టిందన్నారు. ‘‘రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, హక్కుల్ని కాపాడుకునేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. రాజ్యాంగాన్ని మార్చే ఈ బిల్లుకు.. రెండింట మూడొంతుల మెజార్టీ అవసరం. మెజారిటీ రాదనే విషయం బీజేపీకి అర్థమైంది. అందుకే బడుగు, బలహీనవర్గాలకు హక్కుల్ని కల్పించే రాజ్యాంగాన్ని మార్చాలని అమిత్ షా కడుపులో ఉన్న విషయం బయటికొచ్చింది. పార్లమెంట్​లో అంబానీ, అదానీ పేర్లు ప్రస్తావిస్తే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశాలిస్తరు. దళితులు కొలిచే అంబేద్కర్​పై అమిత్ షా తప్పుడు కామెంట్లు చేస్తే ఎందుకు స్పందించలేదు?’’అని ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నించారు.