తెలంగాణలో బీఆర్​ఎస్ 7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టింది

తెలంగాణలో బీఆర్​ఎస్ 7 లక్షల కోట్ల  అప్పుల్లోకి నెట్టింది
  • బెల్లంపల్లిలో సమీకృత కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్​ ప్రారంభం

బెల్లంపల్లి, వెలుగు: పదేండ్లపాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని రూ. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేసిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను అందిస్తున్నదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీలు అమలు పరుస్తామని, ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజల మౌలిక సదుపాయాల కోసం రూ. కోట్లల్లో  ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలో రూ.7.50 కోట్లతో నిర్మించిన సమీకృత కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్​ ప్రారంభోత్సవం బుధవారం జరిగింది.

 అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ చైర్​పర్సన్ జక్కుల శ్వేత తదితరులు పాల్గొన్నారు. మార్కెట్​ కాంప్లెక్స్​ను ఎమ్మెల్యే వినోద్  ప్రారంభించారు. అనంతరం ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ లాడ్స్ నిధులు కేటాయిస్తానని చెప్పారు. ప్రజలు తమను నమ్మి గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెడతామని ఆయన అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్  అన్నారు.  కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్‌‌‌‌లో 105 స్టాళ్లను కూరగాయల వ్యాపారులకు కేటాయించినట్లు చెప్పారు. 

స్టాల్స్ పొందిన వారు నెల రోజుల తర్వాత  డబ్బులు డిపాజిట్​ చేసేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. గోదావరి నుంచి బెల్లంపల్లి పట్టణానికి తాగునీరు అందించేందుకు సర్వే చేస్తున్నట్టు కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు.  కాగా,  బెల్లంపల్లి పట్టణంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్​లో రూ.98 లక్షలతో ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల పవర్ ట్రాన్స్ ఫార్మర్‌‌‌‌ను ఎమ్మెల్యే, ఎంపీ ప్రారంభించారు.  కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ ఈ  శ్రావణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఆర్డీవో పి.హరికృష్ణ, ఏసీపీ రవికుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్​ తదితరులు పాల్గొన్నారు.

దళితుల సమస్యల పరిష్కారానికి కృషి 

పెద్దపల్లి, వెలుగు: దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో  బుధవారం జరిగిన దళిత నాయకుడు బోగె రాజారాం 3వ వర్ధంతి సభలో ఆయన  పాల్గొన్నారు. రాజారాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దళిత వర్గాలకు అండగా రాజారాం నిలిచారని, బడుగు, బలహీన వర్గాల కోసం పోరాటం చేశారని తెలిపారు. బోగె  రాజారాం ఆశయాలను కొనసాగిస్తూ దళితుల హక్కుల కోసం పోరాడాలన్నారు. 

కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి ఎలాంటి డొనేషన్ లేకుండా  అంబేద్కర్ కళాశాల ఏర్పాటు చేసి ఎందరో  పేద విద్యార్థులను ఇంజనీర్లు, డాక్టర్లుగా తీర్చిదిద్ది సమాజానికి అందించారని చెప్పారు. వారి మార్గంలోనే  దళితుల సమస్యల పరిష్కారం కోసం ఎంపీగా కృషి చేస్తానని ఆయన అన్నారు. బోగె రాజారాం కుటుంబానికి తాను అండగా ఉంటానని చెప్పారు. అనంతరం  పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ పాల్గొని.. శుక్రవారం హైదరాబాద్​లో నిర్వహించే  తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ దినోత్సవ పోస్టర్​ను ఆవిష్కరించారు.