ఎన్టీపీసీపై చర్యలు తీసుకోండి..కేంద్రానికి ఎంపీ వంశీకృష్ణ లేఖ

ఎన్టీపీసీపై చర్యలు తీసుకోండి..కేంద్రానికి ఎంపీ వంశీకృష్ణ లేఖ
  • నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టింది
  • కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ లేఖ

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు తీసుకోకుండా ఎన్టీపీసీ సంస్థ పలు నిర్మాణాలు చేపట్టిందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్​లాల్ ఖట్టర్​కు లేఖ రాశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విన్నవించారు. 

‘‘మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ తీసుకోకుండానే ఎన్టీపీసీ టౌన్​షిప్​లోని ఆరు ప్రాంతాల్లో సంస్థ నిర్మాణాలు చేపట్టింది. దీంతో రామగుండం కార్పొరేషన్ సదరు సంస్థకు రూ.99.28 కోట్ల భారీ పెనాల్టీ విధించింది. మున్సిపల్ నిబంధనలను ఎన్టీపీసీ సంస్థ ఉల్లంఘించడం తగదు. రూల్స్ పాటించకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చర్యలు తప్పవు. 

చట్టబద్ధమైన విధానాలు, స్థానిక నిబంధనలు ఎన్టీపీసీ సంస్థ పాటిస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందనేది గుర్తించాలి. భవిష్యత్​లో మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా సంస్థ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారీ పెనాల్టీ అంశాన్ని అత్యంత బాధ్యతాయుతంగా తీసుకుని తగిన పరిష్కార చర్యలు చేపట్టాలి. రామగుండం ప్రాంత అభివృద్ధికి సహకారాన్ని అందించాలి’’అని లేఖలో ఎంపీ వంశీకృష్ణ కోరారు.