- స్పోర్ట్స్‌ను ప్రోత్సహించేందుకు ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయిస్తానని హామీ
- ఆదిలాబాద్‌లో తెలంగాణ స్థాయి గర్ల్స్ ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభించిన ఎంపీ
ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి ఫొటోకు పూలమాలవేసి నివాళి అర్పించారు. స్కౌట్ అండ్ గైడ్స్ స్టూడెంట్ల గౌరవ వందనం స్వీకరించారు. ఔత్సాహిక క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర స్థాయి పోటీలను జరుపుతున్న జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, నిర్వాహకులను అభినందించారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ... ఇలాంటి పోటీలు క్రీడల్లో, రాజకీయాల్లో టీం స్పిరిట్ అలవర్చుకోవడానికి దోహదపడతాయన్నారు. జీవితంలో ఆటలు భాగం కావాలని, తప్పనిసరిగా రోజులో కొంచెం టైమ్ గేమ్స్‌కు కేటాయించాలని సూచించారు. తెలంగాణ క్రీడాకారులు ఒలింపిక్స్ స్థాయికి ఎదగాలని, తెలంగాణ బిడ్డలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలన్నారు.
ప్రతిభ ఉన్న వారికి తన ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. క్రీడలను ప్రోత్సాహించేందుకు ఎంపీ ల్యాడ్స్ నుంచి ఫండ్స్ కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాకా వెంకటస్వామిని సర్మించుకుంటూ పోటీలు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఆయన ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఫాల్గుణ, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్, మందమర్రి సీఐ శశీధర్ రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, రామకృష్ణాపూర్, మందమర్రి కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్లు పల్లె రాజు, నోముల ఉపేందర్ గౌడ్, నిర్వాహణ కమిటీ మెంబర్లు పల్లె రాజు, గోపతి రాజయ్య, మహంకాళీ శ్రీనివాస్, అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, నీలం శ్రీనివాస్ గౌడ్, ఒడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక పర్యాటక స్పాట్‌గా కాలభైరవ టెంపుల్..
కాలభైరవ ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎంపీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారిపెల్లిలోని కాలబైరవ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పారిపెల్లిలోని కాలభైరవ స్వామి ఎన్నో మహిమలు గల దేవుడన్నారు. రాష్ట్ర ప్రజలపైన ఆ దేవుడి చల్లని చూపు ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో నడవాలని కోరుకున్నట్లు చెప్పారు. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు ఫారెస్ట్ పర్మిషన్లు తీసుకొని ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం భీమారం మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైపు లైన్ మరమ్మతుల పనులను ఆయన పరిశీలించారు.
బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో స్టూడెంట్లతో కలిసి భోజనం
గోదావరిఖని, వెలుగు: హాస్టల్స్‌లో కామన్ డైట్ మెనూను అమలు చేస్తూ స్టూడెంట్లకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను ఎంపీ వంశీకృష్ణ ఆదేశించారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కువవుతున్నందున గురువారం గోదావరిఖని ప్రశాంత్ నగర్‌లోని జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్‌ను ఎంపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి క్లాస్ రూమ్‌కు వెళ్లి స్టూడెంట్లను పలకరించారు. వంట గదిని సందర్శించి ఆహార పదార్థాలను పరిశీలించారు.
అనంతరం స్టూడెంట్లతో కలిసి ఆయన భోజనం చేశారు. వంశీకృష్ణ మాట్లాడుతూ, ఫుడ్ పాయిజన్ జరగకుండా చూడాలని, స్టూడెంట్లకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. మెనూ అమలులో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్టల్‌లో నెలకొన్న పలు సమస్యలను టీచర్లు, సిబ్బంది ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో సమస్యలను పరిష్కరిస్తానని వారికి ఆయన హామీ ఇచ్చారు. కాగా, వాష్ రూమ్‌లు నీట్‌గా లేకపోవడంపై హాస్టల్ నిర్వాహకులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.