
- అధికారులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదేశాలు
- ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిశీలన
- కాకా కృషితో ప్రాజెక్టు తెలంగాణకు వరంగా మాaరిందని వెల్లడి
గోదావరిఖని/పెద్దపల్లి, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం పోరాడి.. దాన్ని నిర్మించేందుకు కృషి చేశారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కాకా కృషి వల్ల తెలంగాణకు ఎల్లంపల్లి ప్రాజెక్టు వరంగా మారిందన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల మధ్య గల ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు.
రానున్న వేసవి కాలంలో రైతులకు సాగు, తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు. బీఆర్ఎస్ నిర్మించిన కాళేశ్వరం మాత్రం ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మారి ప్రజలకు భారమయ్యిందన్నారు. ఆ ప్రాజెక్టులో ఉన్న లోపాలను కప్పిపుచ్చేందుకు కేటీఆర్ఎగతాళి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
సూపర్ ఫాస్ట్ రైళ్ల హాల్టింగ్‌కు కృషి
వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగడం కోసం రైల్వే స్టేషన్లలో సూపర్ ఫాస్ట్ రైళ్ల హాల్టింగ్‌కు కృషిచేస్తానని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి పార్లమెంట్ నియోజకవర్గంపరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రామగుండం రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను శుక్రవారం సాయంత్రం ఎంపీ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కరోనా సమయంలో కాజీపేట –- బల్లార్ష అజ్నీ ప్యాసింజర్ రైలును రద్దు చేశారని.. దీంతో ప్రయాణికుల సౌకర్యం కోసం పార్లమెంట్లో మాట్లాడి.. రైల్వే శాఖ మంత్రి, సౌత్ సెంట్రల్ రైల్వే ఆఫీసర్లకు సమస్యను వివరించి రైలును పునరుద్ధరించేలా కృషి చేశానని తెలిపారు.
రామగుండం రైల్వే స్టేషన్లో నవజీవన్, జైపూర్, స్వర్ణ జయంతి, మిలీనియమ్ వంటి సూపర్ ఫాస్ట్ రైళ్ల హాల్టింగ్ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ఎంపీకి రైల్వే ఆఫీసర్లు, కాంగ్రెస్ లీడర్లు స్వాగతం పలికి సన్మానించారు. ఎంపీ వెంట అనుమాస శ్రీనివాస్(జీన్స్), కామ విజయ్, గోవర్ధన్‌రెడ్డి, మల్లేశ్‌యాదవ్, తిప్పారపు మధు, జావిద్, నరేష్, నాని తదితరులున్నారు.
కునారం బ్రిడ్జి పనులను స్పీడప్ చేయండి..
పెద్దపల్లి నుంచి కునారం వైపు వెళ్లే రోడ్డులో నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓర్ బ్రిడ్జి నిర్మాణ పనులను శుక్రవారం ఎంపీ వంశీకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల్లో జాప్యంపై అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పనులను స్పీడప్ చేసి.. నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలన్నారు. ఎంపీ వెంట జిల్లా దిశ కమిటీ మెంబర్ సయ్యద్ సజ్జాద్, బండారి సునీల్ గౌడ్, బాలసాని సతీశ్ గౌడ్, గంగుల సంతోష్, కొండి సతీశ్ తదితరులు ఉన్నారు.
అలాగే, పెద్దపల్లి జిల్లాలో పలు శుభకార్యాలకు ఎంపీ హాజరయ్యారు. పెద్దపల్లి టౌన్లో గంగుల సంతోష్ ఇంటికి తేనీటి విందుకు వెళ్లారు. ఈ సందర్భంగా సంతోష్ కుటుంబ సభ్యులు ఎంపీని సన్మానించారు. అనంతరం కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నరేశ్, విద్య రిసెప్షన్‌కు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు.