- ప్రధాని ఆ రాష్ట్రంలో పర్యటించాలి: ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
- ‘సేవ్ మణిపూర్’ ఆందోళనలో పాల్గొన్న రాష్ట్ర ఎంపీలు చామల, మల్లు రవి, రఘురాంరెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపారని గొప్పలు చెప్పే బీజేపీ నేతలు.. మణిపూర్ అల్లర్లను ఆయన ఎందుకు ఆపలేకపోతున్నారో చెప్పాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ప్రశ్నించారు. ప్రధాని మణిపూర్ లో పర్యటించి అక్కడ శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. మణిపూర్ ప్రజలకు అండగా జంతర్ మంతర్ లో నిర్వహించిన ‘సేవ్ మణిపూర్’ ఆందోళనలో ఇండియా కూటమి ఎంపీలు మద్దతు తెలిపారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్రెడ్డి, మల్లు రవి, రఘురాంరెడ్డి హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. పార్లమెంట్ లో నియంతృత్వ పోకడలతో సభను నిర్వహిస్తున్నారని మండిపడ్డారన్నారు. మణిపూర్ సహా ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో చర్చకు అనుమతించడం లేదన్నారు. రెండేండ్లుగా మణిపూర్ లో వందలాది మంది చనిపోయినా, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా, వేలాదిమంది నిరాశ్రయులైనా ప్రధాని స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఎంపీ చామల మాట్లాడుతూ.. మణిపూర్ అల్లర్ల అంశంపై పార్లమెంట్ లో చర్చ జరగకుండ బీజేబీ అడ్డుపడుతుందని ఫైర్ అయ్యారు. కనీసం ఐదు నిమిషాల పాటుకు చర్చకు కేంద్రం ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం: కాంగ్రెస్ ఎంపీలు
సోనియా గాంధీ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు అన్నారు. ఆమె లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని తెలిపారు. సోమవారం సోనియా గాంధీ జన్మదినం సందర్బంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఎంపీలు గడ్డం వంశీ కృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామిరెడ్డి లతో కలిసి మల్లు రవి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడారు.
సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారమైందని స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఎన్నో సార్లు అంగీకరించారని గుర్తు చేశారు. పదేండ్లలో కేసీఆర్ సాధించలేని ప్రగతి, సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి ఏడాదిలోనే చేసి చూపించారని వివరించారు. తెలంగాణలో ఏడాది కాంగ్రెస్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఎంపీ చామల అన్నారు. రూ.18వేలకోట్ల రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు.