- రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి
- మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్‌కు హాల్ట్ ఇవ్వాలని రిక్వెస్ట్
న్యూఢిల్లీ, వెలుగు: అమృత్ భారత్ స్కీంలో భాగంగా మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ఆధునీకరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. ఈ మేరకు గురువారం పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో వంశీకృష్ణ మాట్లాడుతూ.. అమృత్ భారత్ స్కీమ్‌లో భాగంగా మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఫండ్స్ రిలీజ్ చేయడంతో పాటు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ట్రైన్‌కు హాల్టింగ్ ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరానని చెప్పారు.
గతంలో చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ట్రైన్‌ను అందుబాటులోకి తెచ్చిందని గుర్తుచేశారు. అలాగే ఈ ఏడాది బడ్జెట్ సెషన్‌లో భాగంగా పెద్దపల్లిలో వందే భారత్ ట్రైన్ ఆపాలని కేంద్ర మంత్రిని కోరానని చెప్పారు. వీటిపై రైల్వే శాఖ సానుకూలంగా స్పందించి, అమలు పరిచినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపానని వెల్లడించారు. కాగా, తాజా విజ్ఞప్తులపై కూడా రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని వంశీకృష్ణ తెలిపారు.