మేఘా కంపెనీ పాపంలో మీ వాటా ఎంత కేటీఆర్:ఎంపీ వంశీ గడ్డం

మేఘా కంపెనీ పాపంలో మీ వాటా ఎంత కేటీఆర్:ఎంపీ వంశీ గడ్డం

హైదరాబాద్: మేఘా కంపెనీనీ బ్లాక్ లిస్టులో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేయడంపై సెటైర్లు వేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మేఘా కంపెనీని పెంచి పోషించేదు కేసీఆర్, కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. మేఘా కంపెనీని పాలు పెంచిన పాపంలో తండ్రీకొడుకులిద్దరికీ వాటా ఉందన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం కాంట్రాక్టులు అప్పజెప్పినందుకు మేఘా కంపెనీ ఎన్ని మూటలు ముట్టజెప్పిందో ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే బాగుండేదని సెటైర్లు వేశారు ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. 

మేఘా కంపెనీ బ్లాక్ లిస్ట్ లోపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేయడంపై సోషల్ మీడియా ప్లాట్ ఫాం X ద్వారా స్పందించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ‘‘మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నాం.. ఆయన తండ్రి సీఎంగా, ఆయన మంత్రిగా ఉన్న ప్రభుత్వంలోనే మేఘా కంపెనీకి సుంకిశాల ప్రాజెక్టును కట్టబెట్టిన విషయం కేటీఆర్ గుర్తుచేసి ఉంటే బాగుండేది అన్నారు. పగిలిపోయిన మిషన్ భగీరథ పైపుల నుంచి కుంగిపోయిన కాళేశ్వరం దాకా మేఘా కంపెనీని పాలుపోసి పెంచిన పాపంలో తన ఇంటికి ఎన్ని మూటలు చేరాయో కూడా కేటీఆర్ లెక్క చెబితే ప్రజలకు వాస్తవాలు తెలిసేవి’’ అని సెటైరికల్ గా స్పందించారు. 

పదేండ్లలో మేఘా కంపెనీ నిర్వాకాలు ఎన్నో బయటపడినా, మీడియా కథనాలు వచ్చినా ఎందుకు బ్లాక్ లిస్ట్ చేయలేదని ప్రశ్నించారు. మేఘా కంపెనీని కాపాడినందుకు, ఇంకిన్ని కాంట్రాక్టులు ఇచ్చినందుకు ఎంత ముట్టిందో వివరాలతో మరో ప్రెస్ మీట్ పెట్టాలన్నారు. 11 నెలల ప్రభుత్వం మీద మీరు చేస్తున్న ఆరోపణలు పదేండ్లలో మీ దోపిడీ లెక్కల అనుభవాన్ని బయటపెడుతున్నట్లుగానే ప్రజలకు అర్థమవుతోందన్నారు. వాస్తవాలు రాస్తున్నందుకు ఇదే పత్రికను గతంలో బ్యాన్ చేసినట్లు తానే ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ అలవాటుగా మరిచిపోయారన్నారు ఎంపీ గడ్డం వంశీ కృష్ణ.