సింగరేణి, ఎన్టీపీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్త ..వాటిని పార్లమెంట్​లో ప్రస్తావిస్తా: ఎంపీ వంశీకృష్ణ

 సింగరేణి, ఎన్టీపీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్త ..వాటిని పార్లమెంట్​లో ప్రస్తావిస్తా: ఎంపీ వంశీకృష్ణ
  • రామగుండం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి 
  • రామగుండం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ

గోదావరిఖని/ పెద్దపల్లి, వెలుగు: సింగరేణి, ఎన్టీపీసీ కార్మికుల సమస్యలను పార్లమెంట్​లో ప్రస్తావించి, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం ఎన్టీపీసీ జ్యోతిభవన్​లో కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు. 2018లో చేసుకున్న ఒప్పందాన్ని, ప్రమోషన్​పాలసీని అమలు చేయాలని, ఆరోగ్యంగా ఉన్న కార్మికులను వయసుతో సంబంధం లేకుండా ఉద్యోగంలో కొనసాగించాలని, గేట్​పాస్​ను ఏడాది కాలం పాటు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై ఎన్టీపీసీ ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. సింగరేణి, ఎన్టీపీసీ కార్మికులకు సొంత ఇండ్ల స్కీమ్, ఐటీ మినహాయింపు అంశాలపై పార్లమెంట్​లో మాట్లాడతానని హమీ ఇచ్చారు.

ఆయన వెంట ఐఎన్​టీయూసీ నేషనల్​సీనియర్ ​జనరల్​ సెక్రటరీ బాబర్ సలీం పాషా, కార్పొరేటర్​కొలిపాక సుజాత, జేఏసీ లీడర్లు ఉన్నారు. కాగా, రామగుండం రైల్వే స్టేషన్​ను ఎంపీ వంశీకృష్ణ ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్​లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. మార్చిలోగా పనులు పూర్తవుతాయని ఎంపీకి రైల్వే ఆఫీసర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు మెంబర్​అనుమాస శ్రీనివాస్​, రైల్వే ఆఫీసర్​ ఎంకే గుప్తా, ఆర్పీఎఫ్​ సీఐ సురేశ్​గౌడ్, కమర్షియల్ ​సీఐ కార్తీక్, స్టేషన్​ సూపరింటెండెంట్​మీనా పాల్గొన్నారు. 

గోదావరిఖనిలో మార్నింగ్ వాక్.. 

గోదావరిఖని సింగరేణి జవహర్ లాల్​ నెహ్రూ స్టేడియంలో వాకర్స్​తో కలిసి ఎంపీ వంశీకృష్ణ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్​ ఎంపీని శాలువాతో సత్కరించారు. స్టేడియంలో వాకింగ్​ట్రాక్ తో పాటు వాకర్స్​ కూర్చునేందుకు విశాక చారిటబుల్​ ట్రస్ట్ ​ద్వారా బెంచీలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గోదావరిఖనిలో సెంట్రల్​ లైబ్రరీ ఏర్పాటు కోసం కృషి చేస్తానని తెలిపారు. 15 రోజుల క్రితం గోదావరిఖని సప్తగిరి కాలనీలోని మహాత్మా జ్యోతిబాపూలే స్కూల్​లో పర్యటించిన సమయంలో సిమెంట్​బెంచీలు కావాలని స్టూడెంట్లు అడగ్గా, వాటిని ఎంపీ అందజేశారు.

ఈ సందర్భంగా స్కూల్​ ప్రిన్సిపాల్ ​శిరీష, టీచర్లు ఎంపీని ఘనంగా సత్కరించారు. కాగా, సుందిళ్ల లక్ష్మీనర్సింహ స్వామి టెంపుల్​లో ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరిఖనిలో అనారోగ్యానికి గురైన కాంగ్రెస్​ కార్పొరేషన్​ఏరియా ప్రెసిడెంట్​బొంతల రాజేశ్​ను పరామర్శించారు. రామగుండం లయన్స్​క్లబ్​ ఆధ్వర్యంలో గోదావరిఖని లక్ష్మీనగర్​లో పేదలకు టిఫిన్ ​పంపిణీ చేశారు.

విద్యార్థులు టెక్నికల్ ​స్కిల్స్ పెంచుకోవాలి.. 

విద్యార్థులు టెక్నికల్​ స్కిల్స్, ఇన్నోవేటివ్​స్పిరిట్​ పెంచుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీఐకి కాకా వెంకటస్వామి ఫౌండేషన్​ ద్వారా 150 ఫైబర్​కుర్చీలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. టెక్నాలజీ మీద విద్యార్థులకు ఆసక్తి పెరిగేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. ‘‘నేను చదువుకునే రోజుల్లోనే టెక్నాలజీ మీద ఆసక్తితో ఎలక్ట్రిక్​ బైక్ తయారు చేశాను. ఇన్నోవేటివ్ స్పిరిట్ ఉన్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నేను సహకారం అంది స్తాను.

మేం నిర్వహిస్తున్న అంబేద్కర్​కాలేజీలో ఏటా 25 శాతం మంది విద్యార్థులకు ఫ్రీగా ఎడ్యుకేషన్​అందిస్తున్నాం” అని తెలిపారు. ఈ సందర్భంగా కాలేజీ సమస్యలను సిబ్బంది వివరించగా.. విశాక ట్రస్టు, ఎంపీ నిధులతో ఐటీఐలో అన్ని సౌకర్యాలు కల్పిస్తానని ఎంపీ హామీ ఇచ్చా రు. అనంతరం విద్యార్థుల కోరిక మేరకు వాళ్లతో కాసేపు క్రికెట్​ఆడారు. కాగా, సుల్తానాబాద్​లో పోయినేడాది మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సంవత్సరీకం జరగనున్న సందర్భంగా, ఆయన కుటుంబసభ్యులను ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు.