
- బడ్జెట్లో న్యాయమైన వాటా దక్కడం లేదు
- ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’లో మేము లేమా?
- విద్య, ఉద్యోగాల్లో సరైన అవకాశాలు దక్కడం లేదు
- లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లుపై చర్చలో ఎంపీ ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. దళిత వ్యతిరేకి అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. దళితుల వినాశనం కోరుకుంటున్నదని ఫైర్ అయ్యారు. కేవలం బీజేపీ వికాసం తప్ప... దళితుల అభివృద్ధి జరగలేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశంలోని దళితులకు కేటాయించిన న్యాయమైన వాటా ఎక్కడ ఉన్నదని ప్రశ్నించారు.
‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అని చెప్పే కేంద్ర నినాదంలో దళితులు లేరన్నారు. ఫైనాన్స్ బిల్లుపై లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ తరఫున చర్చలో సోమవారం పాల్గొని మాట్లాడారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం... దళితుల విద్యా, సమానత్వం, సోషల్ ఇన్జస్టిస్పై రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు కల్పించింది.
ఎస్సీల సంక్షేమానికి కేవలం రూ.1.65 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్ లో కేవలం 3.25 శాతం మాత్రమే. దేశంలో 16 శాతానికి పైగా దళితులు ఉన్నారు. జనాభా ప్రాతిపదికన ఎందుకు బడ్జెట్ కేటాయించడం లేదు? ఇదేనా బీజేపీ చెప్పే న్యాయమైనా ఐడియాలజీ? ఇదేనా సబ్ కా వికాస్ అంటే?’’అని వంశీకృష్ణ అన్నారు.
దళితుల విద్య, ఉద్యోగావకాశాలపై ఫోకస్ పెట్టాలి
‘దేశాభివృద్ధి.. ఎస్సీ ఉన్నతీకరణ కోసం సోషల్, ఎకనామిక్ అడ్డంకులను తప్పక తొలగించాలి’అన్న రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కామెంట్లను ఎంపీ వంశీకృష్ణ సభలో గుర్తు చేశారు. ‘‘ఎస్సీ వర్గం అభ్యున్నతి కోసం దేశంలోని దళిత ఎంటర్ ప్రెన్యూర్స్ కు స్పెషల్ ట్యాక్స్ కన్సెషన్ ఇవ్వాలి. ఇప్పటికీ విద్య, ఉద్యోగాల్లో దళితులకు సరైన అవకాశాలు దక్కడం లేవు.
దీనిపై కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి. తెలంగాణ, కర్నాటక ప్రభుత్వాలు అందిస్తున్నట్లు టెక్నికల్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, ఇండస్ట్రియల్ బెనిఫిట్స్‌ను ఈ అట్టడుగు వర్గాలకు అందించాలి. ఎస్సీ కాలనీలు, ఎస్సీ హౌసింగ్ సొసైటీలపై దృష్టిపెట్టాలి’’అని వంశీ కృష్ణ అన్నారు.
దేశ జీడీపీలో మాదే సింహభాగం
దేశ జీడీపీలో తెలంగాణది సింహభాగమని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ‘‘తెలంగాణతో కలిపి దక్షిణాది రాష్ట్రాలు 36% జీడీపీని అందిస్తున్నాయి. కానీ.. చివరికి కేవలం 15 శాతం నిధులు మాత్రమే పొందుతున్నాయి. ఈ తేడా ఎందుకు? దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఎందుకు చిన్న చూపు చూస్తున్నది? మేం ఇండియాలో భాగం కాదా? సబ్ కా సాత్–సబ్ కా వికాస్ లో మేం లేమా? మహాకుంభ మేళాకు స్పెషల్ ట్రైన్లు వేశారు.
ఇతర సౌకర్యాలు కల్పించారు. తిరుపతి, శబరిమలకు వెళ్లే భక్తుల కోసం నేను ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దపల్లి నుంచి ఎందుకు ట్రైన్ సౌకర్యం కల్పించడం లేదు? పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్‌కు బడ్జెట్ లో రూ.10 వేల కోట్లు కేటాయించాలి. స్థానిక ప్రజలకు ఉద్యోగాలు కావాలి’’అని వంశీకృష్ణ అన్నారు. చెన్నూరు అసెంబ్లీలో టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు, సింగరేణి విస్తరణ, ఆ సంస్థలో ఉద్యోగాల రక్షణ, భద్రత, ఎన్టీపీసీలో గ్రీన్ అండ్ క్లీన్ టెక్నాలజీలు, పెద్దపల్లిలో స్టార్ట్ ఇంక్యూబేషన్ హబ్ లు అవసరమన్నారు.
టూరిజం డెవలప్మెంట్ గ్రాంట్స్ లో భాగంగా రామగిరి, ధర్మపురి ఆలయాలకు ఇవ్వాలని కోరారు. పెద్దపల్లిలో బీపీఓ సెంటర్, క్లోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల నుంచి కొత్త రైల్వే లైన్లు వేయాలని కేంద్రాన్ని కోరారు.