- పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మృతుల కుటుంబాలకు పరామర్శ
గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్ట్‌లో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోవడం బాధాకరం అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌తో కలిసి గోదావరిఖనిలో గాదం విద్యాసాగర్, సెంటినరీ కాలనీలో ఉప్పుల వెంకటేశ్వర్లు మృతదేహాన్ని సందర్శించి, నివాళి అర్పించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి మేనేజ్‌మెంట్ రక్షణ చర్యలు పాటిస్తూ ఉత్పత్తిని సాధించాలని సూచించారు.
మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్మిక కుటుంబాలకు అన్ని బెనిఫిట్స్‌తో పాటు వారి డిపెండెంట్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆఫీసర్లకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ వద్ద మృతుల కుటుంబాలను రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, రాష్ట్ర మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్, మంత్రి శ్రీధర్‌బాబు సోదరుడు శ్రీనుబాబు, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ రాజ్‌కుమార్, టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి పరామర్శించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
ప్రమాదంలో రక్షణ లోపాలు కనిపిస్తున్నాయి : సింగరేణి డైరెక్టర్ ఎన్‌వీకే శ్రీనివాస్
గని ప్రమాదంలో చనిపోయిన కార్మికుల మృతదేహాలను సింగరేణి డైరెక్టర్ ఎన్‌వీకే శ్రీనివాస్ గురువారం గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్‌లో సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రక్షణ చర్యల లోపం వల్లే ప్రమాదం జరిగినట్టు కనిపిస్తోందన్నారు. పైపుల రిపేర్ కోసం తీసిన మట్టిని ఏటవాలుగా పోయకపోవడంతో వర్షానికి తడిసిన మట్టి కార్మికులపై పడిందన్నారు. డీజీఎంఎస్ ద్వారా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు సంస్థ అండగా ఉంటుందని చెప్పారు.