
కోల్ బెల్ట్: పెద్దపల్లి పార్లమెంట్స్థానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఇవాళ మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఎంపీ వంశీకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామన్నారు. అనంతరం మంచిర్యాలలోని లేబర్ బస్తీలోని పంచముఖ హనుమాన్ దేవస్థానాన్ని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో పలు ఎక్స్ప్రెస్రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కారించాలని స్థానికులు వినతి పత్రాన్ని అందించగా, సానుకూలంగా స్పందించిన ఎంపీ త్వరలోనే రైల్వే జీఎంను కలిసి ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్, రైల్వే స్టేషన్ అభివృద్ధి, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.
బెల్లంపల్లి–చంద్రాపూర్ కన్నాల జాతీయ రహదారిని పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇడిగిరాల భీమయ్య ఇల్లు దగ్ధమైంది. దగ్ధమైన ఇల్లును పరిశీలించి బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.