
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: గతంలో తాను బీఆర్ఎస్లో ఎంపీగా ఉన్నపుడు ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు గురించి చాలాసార్లు మాట్లాడానని.. జోగు రామన్న గతాన్ని గుర్తుకు చేసుకోవాలని ఎంపీ గోడం నగేశ్అన్నారు. లేనిపోని ఆరోపణలు మానుకోవాలని సూచించారు. బుధవారం ఆదిలాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి విలేకరుల సమావేవంలో మాట్లాడారు. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశమై విమానాశ్రయం ఏర్పాటు చేయిస్తామని పేర్కొన్నారు.
తాను బీజేపీ ఎంపీగా గెలిచిన తర్వాత పాయల్ శంకర్‌తో కలిసి విషయం గురించి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి మాట్లాడానని, అందుకు ఆయన ఒప్పుకున్నారని పేర్కొన్నారు. పాయల్‌శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కోసం పాటు పడుతున్నామని, కానీ జోగు రామన్న లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికైనా ఆయన నిజాలు మాట్లాడాలని సూచించారు. సీసీఐ ఫ్యాక్టరీ, విమానశ్రయం గురించి తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, నాయకులు ఆదినాథ్, రఘుపతి, లాలా మున్నా, నగేశ్, విజయ్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.