యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రంపై రోజురోజుకీ వివాదాలు ఎక్కువవుతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది. దీంతో ఈ చిత్రంలోని కొన్ని పాత్రలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా ఆదిపురుష్ టీజర్ పై స్పందించారు. ఈ విషయంపై త్వరలో చిత్ర నిర్మాత ఓం రౌత్ కు లేఖ రాస్తానని చెప్పారు. ఈ టీజర్ లో హనుమంతుడి పాత్రను తోలుతో చేసిన కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేశారు. దీనిపై అభ్యంతరం తెలియజేస్తూ.. వెంటనే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని మంత్రి, నిర్మాతను కోరారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాదు ఆదిపురుష్ సినిమాలో రామాయణాన్ని తప్పుగా ప్రదర్శించారని ఆరోపించారు. రావణుడిని చూపించిన తీరుపైనా ఆయన వ్యతిరేకత వ్యక్తం చేశారు.
ఇటీవలే అయోధ్యలో అత్యంత అట్టహాసంగా ఆదిపురుష్ టీజర్ ను విడుదల చేశారు. రిలీజ్ చేసిన గంటల్లోనే ఈ మూవీ టీజర్ కు విశేష స్పందన వచ్చింది. కేవలం 19 గంటల వ్యవధివోనే 63మిలియన్ల వ్యూస్, 10 లక్షల లైక్స్ వచ్చాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో సంక్రాంతి కానుకగా రాబోతుంది. ఆదిపురుష్ సినిమాలో ప్రముఖ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషిస్తుండగా, హీరోయిన్ కృతి సనన్ సీతగా నటిస్తున్నారు.