విద్య, వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి : ఎంపీ కడియం కావ్య

విద్య, వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి : ఎంపీ కడియం కావ్య
  • 'దిశ' మీటింగ్ లో వరంగల్ ఎంపీ కడియం కావ్య

హనుమకొండ, వెలుగు: విద్య, వైద్యరంగాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని జిల్లా దిశ కమిటీ చైర్మన్‌, వరంగల్‌ఎంపీ కడియం కావ్య ఆఫీసర్లకు సూచించారు. హనుమకొండ కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. చీఫ్ గెస్ట్ గా హాజరైన ఎంపీ కడియం కావ్య ముందుగా కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చే నిధుల కేటాయింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల పనులకు సంబంధించి ఫండ్స్ ఏమైనా పెండింగ్ లో ఉంటే వివరాలు అందించాలని, రిలీజ్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్ లో చదువుతున్న పిల్లలు పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని, వారిపై దృష్టిసారిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. అనాథ పిల్లలు, దివ్యాంగుల సంరక్షణ ముఖ్యమని, వారికి రాష్ట్రం నుంచి వచ్చే సదుపాయాల కల్పించాలన్నారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాలనీల్లో శానిటేషన్ సమస్య తలెత్తుతోందన్నారు.

వరంగల్‌నగరాన్ని స్మార్ట్​ సిటీగా డెవలప్ చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని కోరారు. స్టేషన్‌ఘన్ పూర్‌ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ స్కూళ్లలో డ్రాప్‌ఔట్స్‌ విద్యార్థుల వివరాలు సేకరించి, వంద శాతం హాజరు ఉండేలా చూసుకోవాలన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ మడికొండ, భట్టుపల్లి ఇందిరమ్మ కాలనీల్లో రోడ్లు, స్ట్రీట్​ లైట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలను పరిష్కరించేందుకు ఆఫీసర్లు చొరవ చూపాలన్నారు. సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, డీఎంహెచ్​వో అప్పయ్య, అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటరెడ్డి, డీఆర్డీవో నాగపద్మజ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.