కాజీపేట్​లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై క్లారిటీ ఇవ్వండి..కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ కడియం కావ్య

కాజీపేట్​లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై క్లారిటీ ఇవ్వండి..కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ కడియం కావ్య

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ విభజన చట్టం–2014లో పొందుపరిచినట్లు తెలంగాణలోని కాజీపేట్ లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారా? లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కేంద్రాన్ని నిలదీశారు. అలాగే నష్కల్–హసన్ పర్తి, నష్కల్–చింతలపల్లి బైపాస్ రీఅలైన్మెంట్ అంశాలను లేవనెత్తారు. ఈ విషయంలో రైతులకు నష్టం జరగకుండా చూడాలని సభ ద్వారా కేంద్రాన్ని కోరారు. వీటితో పాటు కాజీపేట రైల్వే స్టేషన్ లో అదనపు ఫ్లాట్ ఫామ్ లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

బుధవారం లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇస్తు.. కాజీపేట లో రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్​ను సమగ్ర ఇంజిన్, కోచ్, వ్యాగన్ల ఉత్పత్తి యూనిట్ గా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. రైల్వే డివిజన్ ఏర్పాటుపై ఎంపీ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. గత ప్రభుత్వాలు విడుదల చేసిన నిధులతో పోలిస్తే ప్రస్తుతం రూ.5 వేల కోట్ల పైచిలుకు నిధులు తెలంగాణ రాష్ట్రానికి రైల్వే పనులకోసం కేటాయించామని చెప్పారు. దీనిపై మరోసారి ఎంపీ కావ్య స్పందిస్తూ... బైపాస్ రైల్వే లైన్ లు వ్యవసాయ రంగ కార్యకలాపాలకు అవరోధంగా నిలుస్తూ రైతులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయని కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంలో ఎంపీ కావ్య చేసే సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.