న్యూఢిల్లీ, వెలుగు: వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ పనులను త్వరితగతిన ప్రారంభించాలని కేంద్రానికి ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిను కలిసి వినతి పత్రం అందజేశారు. మామునూరు ఎయిర్పోర్ట్ పనులపై ఇరువురు చర్చించారు.
రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న నగరంగా వరంగల్ ఉందని కేంద్రమంత్రికి కడియం కావ్య తెలిపారు. అందుకే వరంగల్ ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రూ. 4వేల కోట్లు రిలీజ్ చేసినట్లు వివరించారు. ఎయిర్ పోర్టు పునరుద్ధరణ కోసం రూ.205 కోట్లతో భూసేకరణకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రెండేండ్లలో మామునూరు ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. తమ విజ్ఞప్తిపై మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ కావ్య పేర్కొన్నారు.