త్వరలోనే కొత్త వరంగల్ చూడబోతున్నాం

త్వరలోనే కొత్త వరంగల్ చూడబోతున్నాం

వరంగల్, వెలుగు: ఉమ్మడి ఓరుగల్లు జనాలు త్వరలోనే కొత్త వరంగల్ చూడబోతున్నారని ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్​రెడ్డి, కేఆర్ నాగరాజు తెలిపారు. సీఎం రేవంత్​రెడ్డి వరంగల్​పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ వరంగల్​లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు బుధవారం హనుమకొండ కలెక్టరేట్​లో హనుమకొండ, వరంగల్​ కలెక్టర్లు, అధికారులతో రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ మామునూర్ ఎయిర్​పోర్ట్​ ఏర్పాటుకు 950 ఎకరాలు అవసరం ఉంటే 693 ఎకరాలు కేంద్ర విమానయాన సంస్థ ఆధీనంలో ఉందని, మరో 253 భూసేకరణ జరుగుతోందన్నారు. నగరానికి నష్కల్ నుంచి హసన్​పర్తి, నష్కల్ నుంచి చింతలపల్లి వరకు రెండు రైల్వే లైన్లు వస్తున్నట్లు చెప్పారు. మేయర్​మాట్లాడుతూ వరంగల్ మాస్టర్ ప్లాన్, అండర్​గ్రౌండ్ డ్రైనేజీపై అధికారులు డీపీఆర్ రెడీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

భద్రకాళీ చెరువును రేపటి నుంచి ఖాళీ చేస్తాం..

నగరాభివృద్ధి విషయంలో సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆర్డర్స్ ఇస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి వెల్లడించారు. భద్రకాళి చెరువు పూడికతీత పనుల కోసం రేపటి నుంచే చెరువును ఖాళీ చేయనున్నట్లు చెప్పారు. గ్రేటర్ వరంగల్​లో జరిగిన, చేపట్టబోయే అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు ఈ నెల18న లేదా ఒకట్రెండు రోజులు అటుఇటుగా సీఎం రేవంత్​రెడ్డి వరంగల్ పర్యటనకు వస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ మామునూర్ ఎయిర్​పోర్ట్, ఓఆర్​ఆర్, ఐఆర్ఆర్ నిర్మాణానికి భూసమీకరణ చేసి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. సమావేశంలో కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే పాల్గొన్నారు.