- సీఎం రేవంత్ ను అభినందించాల్సిందిపోయి.. చిల్లర కామెంట్లు చేస్తున్రు
- ఎమ్మెల్యేలు నాయిని, రేవూరి, నాగరాజు, ఎంపీ కావ్య
వరంగల్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్‍రెడ్డి ప్రభుత్వం రూ.6 వేల కోట్ల నిధులతో వరంగల్ ను అభివృద్ధి చేస్తుంటే.. బీఆర్‍ఎస్ నేతలకు కడుపు మండుతుందని కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి ఫైర్ అయ్యారు.
జీఓ కాపీలు కూడా చదవడంరాని దౌర్భాగ్య నేతలు బీఆర్‍ఎస్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన గ్రేటర్ కాంగ్రెస్ భవన్ లో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి ప్రెస్‍మీట్ నిర్వహించి మాట్లాడారు.
మాజీ మంత్రి, మాజీ స్పీకర్ మధుసూదనచారి, ఎమ్మెల్యే పల్లా, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి తదితరులు సీఎం రేవంత్‍రెడ్డిని విమర్శించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓరుగల్లులో గత పాలకులు కబ్జాలతో అభివృద్ధిని పట్టించుకోకుంటే.. మరికొందరు కాంట్రాక్టర్ల బిల్లుల్లో కమీషన్లకు కక్కుర్తి పడటంతో అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపించారు. వీరి నిర్వాకం వల్లే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదని మండిపడ్డారు.
కాళోజీ కళాక్షేత్రం కోసం రూ.95 కోట్లు ఖర్చు అయితే అందులో బీఆర్‍ఎస్ ప్రభుత్వం 9 ఏండ్లలో కేవలం రూ.20 కోట్లు ఇచ్చిందని.. మరో రూ.45 కోట్లు రేవంత్‍రెడ్డి సీఎం అయ్యాక ఇచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి వేల కోట్ల నిధులు ఇస్తుంటే అభినందించాల్సిపోయి..చిల్లర కామెంట్లు చేస్తున్నారని ఎంపీ కడియం కావ్య విమర్శించారు.
ఎర్రబెల్లికి జ్ఞానం తక్కువ.. తిట్లు తిట్టడడం ఎక్కువని ఎమ్మెల్యేలు రేవూరి, కేఆర్.నాగరాజు ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, పార్టీ వరంగల్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు
పాల్గొన్నారు.