కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లుతో రైతులకు తీరని నష్టం కలుగుతుందని ఎంపీ కేశవరావు పేర్కొన్నారు. కేంద్రం తీసుకు వచ్చిన చట్టం మార్కెటింగ్ ఏజెంట్లకు కూడా నష్టం కలిగించేలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులతో గానీ విపక్షాలతో గానీ సంప్రదించకుండా ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకుందని కేకే ఆరోపించారు. కార్పొరేట్లకు లబ్ది చేకూర్చేందుకే ఈ బిల్లులని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయంలో కూడా కార్పొరేట్లను పెంచి పోషించేలా చట్టం ఉందన్నారు.
12 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా తన అనుభవంలో ఎప్పుడు జరగని రీతిలో నిబంధనలను అతిక్రమించడం, మాట్లాడే హక్కును అన్నింటినీ కాలరాశారన్నారు. సభలో చర్చ అంత బాగానే జరిగింది.. కానీ ఓటింగ్ సమయం వచ్చేసరికి పరిస్థితులు అన్ని ఒక్కసారిగా మారిపోయాయన్నారు. ప్రభుత్వం ఒక పక్కకు వచ్చి డిప్యూటీ చైర్మన్ ను ప్రభావితం చేయడంతో బిల్లులను ఆమోదించారన్నారు. బిల్లులను రిజెక్ట్ చేయాలని రెండు తీర్మానాలు వచ్చిన వాటికి సమయం ఇవ్వలేదన్నారు. 12 పార్టీల సభ్యులందరం డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చామని, ఇదే అంశంపై సోమవారం ఒత్తిడి తెస్తామని చెప్పారు
ఒక్కో క్లస్టర్‌లో 1.65 లక్షల మంది రైతులు ఉన్నారన్న కేకే.. కేంద్రం ఏ పథకానికీ సరిగా నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందన్నారు. వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేసే యత్నాన్ని తాము ప్రతిఘటిస్తామని చెప్పారు. వ్యవసాయ సంబంధిత అంశాలు ఎప్పుడూ రాష్ట్ర పరిధిలోనే ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.