Andhra Cricket: మంగళగిరి, కడపలో అంతర్జాతీయ మ్యాచ్‌లు: ఎంపీ కేశినేని

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ ఎన్నికయ్యారు. ఆదివారం(సెప్టెంబర్ 09) జరిగిన ఏసీఏ జనరల్ బాడీ సమావేశంలో ఏసీఏ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎంపీకి సర్టిఫికెట్‌ అందజేశారు. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా ఎస్.సతీష్, సంయుక్త కార్యదర్శిగా ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా జి.విష్ణు తేజ్‌లను రమేష్ కుమార్ ప్రకటించారు.

మంగళగిరి, కడపలో అంతర్జాతీయ మ్యాచ్‌లు 

ఈ సంధర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రికెట్‌కు అవసరమైన మౌళిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు విశాఖ ఒక్కటే అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికగా ఉందన్న ఆయన.. రాబోవు రోజుల్లో మంగళగిరి, కడపలోనూ ఇంటర్నేషనల్‌ మ్యచ్‌లు జరిగేలా తన వంతు కృషి చేస్తానని మాటిచ్చారు. అలాగే సరైన అవకాశాలు పొందలేని ప్రతిభావంతులైన గ్రామీణ యువతకు ACA ఒక సహాయక వ్యవస్థగా నిలుస్తుందని అన్నారు. అందుకు అవసరమైన తగు చర్యలు తీసుకుంటామన్నారు.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల సంభవించిన వరదల బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలను విరాళంగా ఇవ్వాలని నూతన కార్య వర్గం తమ తొలి నిర్ణయం తీసుకుంది.