ఒక్క చాన్స్​ ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తాం

అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్న హైదరాబాద్ ‘మినీ భారత్’ వంటిది. చారిత్రకంగా అత్యాధునిక సదుపాయాలతో ఏర్పడిన హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు ప్రజలు అవకాశాలు ఇచ్చారు. అయినా వారి అభిలాష మేరకు నగరంలో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రాలేదు. ఆరేండ్లుగా టీఆర్ఎస్, ఎంఐఎం కూటమి ప్రజల సదుపాయాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడంతో విషాద నగరంగా, కాలుష్య నగరంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం వరకు నగర పాలన చేపట్టి వాటిని మేటి నగరాలుగా అభివృద్ధి చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. ఇప్పుడు బీజేపీకి కూడా ఒక అవకాశం ఇస్తే.. అన్ని వర్గాల ప్రజలు సౌలభ్యంగా తమ జీవనోపాధులను కొనసాగించుకొనేందుకు అనువైన నగరంగా హైదరాబాద్​ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని భరోసా ఇస్తున్నాం.

డివిజన్​ కమిటీలతో సమస్యల పరిష్కారం

ప్రతి డివిజన్ కు ఒక ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి, ఒక ప్రత్యేకాధికారిని నియమించి ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తాం. డివిజన్ల వారీగా సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుపుతాం. ఇక ప్రతి డివిజన్ లో అక్కడి జనాభా అవసరాలకు అనువుగా చిల్డ్రన్ ప్లే జోన్, స్విమ్మింగ్​ పూల్స్​ ఏర్పాటు చేస్తాం. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ కోసం హై క్వాలిటీ వైఫై సదుపాయం కల్పిస్తాం. ప్రతి డివిజన్ లో నాలుగు శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడంతో పాటు నగరం నలువైపులా ఆధునిక డంపింగ్ యార్డ్ లను ఏర్పాటు చేస్తాం. రహదారులు గుంటలు పడితే 15 రోజుల్లో మరమ్మతులు చేయిస్తాం. కాలనీ సంక్షేమ కమిటీలే ఆ పని పూర్తి చేస్తే వారికి తగు వ్యయం చెల్లిస్తాం. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ తో పాటు 24 గంటలు తాగునీటి సరఫరా ఉచితంగా అందిస్తాం. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమాను నగరంలో అమలు చేయడంతోపాటు అన్ని బస్తీ దవాఖాన్లలో హెల్త్ అడ్వయిజరీ సెల్ లను ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్ రద్దీలను తగ్గించడం కోసం మెట్రో రైల్ సేవలను పాతబస్తీ, ఎయిర్ పోర్ట్, లింగంపల్లితో పాటు నగరంలో అన్ని వైపులకూ విస్తరిస్తాం. మెట్రో స్టేషన్ల వద్ద సురక్షిత పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తాం. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు ఎటువంటి ట్రాఫిక్ జరిమానాలు లేకుండా చూస్తాం. రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మార్కెట్ యార్డుల్లో పనిచేసే కార్మికులకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తాం. కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యాపారులను కోలుకునేలా చేయడానికి వారికి ఆస్తి పన్నుతోపాటు లైసెన్స్ ఫీజు ల్లో 50 శాతం మేరకు రాయితీ కల్పిస్తాం. నగరంలో 20,000కు పైగా ఉన్న సెలూన్లకు రూ.15,000 వరకు వడ్డీ లేని రుణాలు సమకూరుస్తాం.

సిటీ బస్సులు, మెట్రోల్లో మహిళలకు ఫ్రీ జర్నీ

మహిళల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. సిటీ బస్సులు, మెట్రోల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. ఏడాదికి మూడు చొప్పున ఐదేండ్లలో 15 మహిళా పోలీస్ స్టేషన్లను అదనంగా ఏర్పాటు చేస్తాం. మహిళల కోసం కిలోమీటర్ కు ఒక టాయిలెట్ ఏర్పాటు చేస్తాం. అన్ని ప్రభుత్వ స్కూళ్లను మోడల్ పాఠశాలలుగా అభివృద్ధి చేసి, అక్కడ చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్​ లను అందిస్తాం. విద్యార్థులకు ఉచితంగా వైఫై సదుపాయం కల్పిస్తాం. ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించడంతోపాటు కరోనా సమయంలో చితికిపోయిన ప్రైవేట్ పాఠశాలల యజమానులను ఆదుకుంటాం. లక్ష మంది పేదలకు ప్రధాని ఆవాస్​ యోజన కింద ఇండ్లు నిర్మిస్తాం. ఎస్సీ కాలనీలు, బస్తీ వాసులకు ఆస్తి పన్ను రద్దు చేయడంతోపాటు 125 గజాలలోపు ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు అవసరం లేకుండా చేస్తాం. ప్రజలందరికీ ఉచిత మంచి నీరు అందిస్తాం. పేదలకు 100 యానిట్ల వరకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తాం. ఆస్తి పన్నుపై భారీ జరిమానాలు లేకుండా చేస్తాం. పాతబస్తీలో ఏటా జరుగుతున్న రూ.600 కోట్లకు పైగా విద్యుత్ చౌర్యాన్ని పూర్తిగా అరికడతాం. లక్షలాది మందికి సేవలు అందిస్తున్న జీహెచ్ఎంసీ ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తాం. ప్రస్తుతం ఉన్న 29,000 ఖాళీలను భర్తీ చేయడం ద్వారా వారికి పనిభారం తగ్గిస్తాం. ఎటువంటి పన్నులు వారి నుంచి వసూలు చేయకుండా ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన కింద వారికి గృహ నిర్మాణం కోసం రుణాలు అందిస్తాం. కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం.

సుమేధ పేరుతో నిధి ఏర్పాటు చేస్తాం

మల్కాజ్​గిరిలోని దీన్​ దయాళ్ నగర్ లో 12 ఏండ్ల చిన్నారి సుమేధ ఓపెన్ నాలాలో పడి ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఓపెన్ నాలాలు, డ్రైనేజీ కాలువలను ఆధునీకరించడానికి సుమేధ పేరుతో10వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తాం. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా కాపాడేందుకు టాస్క్ ఫోర్స్​ ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి నెలా చెరువుల పరిస్థితులను పబ్లిక్ డొమైన్​లో ఉంచుతాం. నాలాల ఆక్రమణలు అరికట్టడం కోసం కూడా ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, అన్ని ఆక్రమణలను తొలగిస్తాం. ఆటో డ్రైవర్లకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడంతోపాటు సొంత ఆటోలు గలవారికి బీమా, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం రూ.7వేల సాయం అందిస్తాం. వీధి వ్యాపారులకు కూడా ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తాం. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా సహకరించడంతోపాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా అతి పెద్ద తెలుగు గ్రంథాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తాం. లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం నైపుణ్య శిక్షణ కల్పిస్తాం.

పక్కా ప్రణాళికతో అభివృద్ధికి బాటలు

పట్టణాభివృద్ధి సంస్థను పటిష్టపరచి, కాలుష్య నివారణకు అదనపు నిధులు కేటాయించి దేశంలోనే పరిశుభ్రమైన సిటీగా తీర్చిదిద్దుతాం. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం లభించే అన్ని అధికారాలు, విధులు అమలయ్యేలా చూస్తాం. పౌర సేవలను పొందటం ప్రాథమిక హక్కుగా గుర్తించి ఒక ప్రత్యేక చట్టం తీసుకువస్తాం. రూ.10,000 కోట్లతో మూసీ నది ప్రక్షాళన చేసి ఆహ్లాదకరమైన నదిగా అభివృద్ధి చేస్తాం. మూసీ పరీవాహక ప్రాంతాల అభివృద్ధి కోసం మూసీ జలాల శుద్ధి కోసం 20 ప్రాంతాల్లో సీవరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. వచ్చే వర్షాకాలం నాటికి హైదరాబాద్ లోని అన్ని నాలాలను పునరుద్ధరిస్తాం. అంతేకాకుండా, మురికివాడలను ఆధునిక నివాసయోగ్య ప్రాంతాలుగా మలచడంతోపాటు పాలనా వ్యవస్థలోనే కాకుండా రాజకీయపరమైన అవినీతిని కూడా తుదముట్టించి స్వచ్ఛమైన పాలన ఇస్తాం. స్వచ్ఛమైన పరిసరాలతోపాటు స్వచ్ఛమైన రాజకీయాలు కూడా అందిస్తాం.

వరద బాధితులకు రూ.25 వేల సాయం

మెరుగైన రహదారులు, చిక్కులు లేని ట్రాఫిక్ సదుపాయాలు, కాలుష్యం లేని మూసీ నదితోపాటు నగరంలోని వందలాది చెరువులు, కుంటలను అభివృద్ధి చేస్తాం. వీటన్నింటితోపాటు మెరుగైన ప్రజారవాణా వ్యవస్థలు అభివృద్ధి చేయగలమని హామీ ఇస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరదల్లో నష్టపోయిన వారందరికీ రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. నగర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తాం. తెలంగాణ విముక్తి దినం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తాం. ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను రద్దు చేస్తాం. హైదరాబాద్‌‌‌‌లో డ్రైనేజీ వ్యవస్థను అత్యాధునికంగా అభివృద్ధి చేస్తాం. అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం. పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్టులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. హైదరాబాద్ ను ‘అమృత్’ నగరంగా ప్రకటించి, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు సమకూర్చుకొని సమగ్రాభివృద్ధికి పలు పథకాలు అమలు చేస్తాం.

– కిషన్​రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

For More News..

హర్షద్ మెహతా వెబ్‌‌ సిరీస్‌‌తో పెరిగిన ఓటీటీ యూజర్లు