నల్గొండ కాంగ్రెస్ టికెట్బీసీలకే ఇవ్వాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. తాను పోటీ చేయాలనుకున్న నల్గొండ సీటును బీసీలకు ఇస్తానని మంగళవారం గాంధీ భవన్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వెంకట్‌రెడ్డి కామెంట్ల వెనక అసలు కారణం ఏమై ఉండొచ్చని పార్టీలో చర్చ జరుగుతోంది. నల్గొండ ఎమ్మెల్యే టికెట్ కోసం మొత్తం ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో బీసీ లీడర్లు నల్గొండ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, తిప్పర్తి జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్ ఉన్నారు.
అయితే, బీసీలకే అవకాశం ఇవ్వాలని వెంకట్‌రెడ్డి కచ్చితమైన అభిప్రాయానికి వస్తే.. లక్ష్మి పేరునే ఆయన ప్రతిపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లక్ష్మి చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడే ఆమె భర్త శ్రీనివాస్ హత్యకు గురయ్యారు. ప్రస్తుతం వార్డు కౌన్సిలర్‌గా ఉన్న ఆమె.. వెంకట్‌రెడ్డి సూచన మేరకే ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తు చేశారని చెప్తున్నారు. కాగా, మొదటి నుంచి నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటిస్తూ వచ్చిన ఆయన అకస్మాత్తుగా బీసీలకు ఇవ్వాలనే ప్రతిపాదన ముందు పెట్టడం వెనుక బలమైన కారణాలే ఉంటాయని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.
ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్లో రెండు సీట్లు బీసీలకు..
ఒక్కో పార్లమెంట్‌స్థానం పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ ఉదయ్ పూర్ డిక్లరేషన్‌లో తీర్మానించారు. ఈ తీర్మానికి పార్టీ కట్టుబడి ఉందని ఎంపీ వెంకట్‌రెడ్డి భువనగిరి సభలో ఇటీవల ప్రకటించారు. దీంతో నల్గొండ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో నల్గొండ, మిర్యాలగూడ బీసీలకు ఇవ్వాలని పార్టీలో చర్చ జరుగుతోంది. భువనగిరి పరిధిలో భువనగిరి, ఆలేరు సీట్లు బీసీలకు ఇస్తామని ఇప్పటికే వెంకట్‌రెడ్డి ప్రకటించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన ఎంపీ వెంకట్ రెడ్డి.. ఎమ్మెల్యే సీటును కూడా వదులుకోవడం గొప్ప విషయమని, తన నిర్ణయాన్ని స్వాగతిస్తామని ఆ పార్టీ బీసీ నేతలు, జిల్లా బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.