న్యూఢిల్లీ: పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ప్రియాంకకు వివరించినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం తనను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని కంప్లైంట్ చేసినట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రియాంకతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. నిన్న రాష్ట్ర ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ నిర్వహించిన సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ముందస్తు అనుమతి తీసుకునే సమావేశానికి హాజరుకాలేదని వెంకట్ రెడ్డి మీడియాకు వివరణ ఇచ్చారు.
సుదీర్ఘ కాలం పార్టీకి సేవలందించిన తాను.. పార్టీనే కొనసాగుతానని ప్రకటించిన నేపథ్యంల ఏఐసీసీ నేతల నుంచి పిలుపు వచ్చింది. ప్రియాంకతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని హైకమాండ్ నేతలు కల్పించారు. హైకమాండ్ పిలుపునకు స్పందించిన వెంకట్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ను కలసిన అనంతరం.. ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు.