- అకాల వర్షాలతో రైతులు ఆగమైతున్రు..
- ‘బీఆర్ఎస్’ కాకుంటే ‘పీఆర్ఎస్’ పెట్టుకోండి
- చేతగాని మంత్రులతో ఎలాంటి ఉపయోగం లేదు..
- కేసీఆర్ సర్కారుపై ఎంపీ కోమటిరెడ్డి అసహనం
యాదాద్రి, వెలుగు : ‘వడ్లు కొంటున్నామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పి 15 రోజులైనా కొనుగోళ్లు స్పీడ్ అందుకోలేదు. కేంద్రాల్లోని వడ్లు అకాల వర్షానికి ఆగమవుతున్నాయి. రైతుల తరపున కేసీఆర్‌కు చేతులెత్తి దండం పెడుతున్నా.. బీఆర్ఎస్ కాకుంటే పీఆర్ఎస్ (ప్రపంచ రాష్ట్ర సమితి) పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు. కానీ వడ్లను మాత్రం వెంటనే కొనండి’ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ సర్కార్‌లోని చేతగాని మంత్రులతో ఎలాంటి ఉపయోగం లేదని అసహనం వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా గుండాలలో జరిగిన కాంగ్రెస్ ‘మాట ముచ్చట’ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. ఈ లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, క్వింటాల్వడ్లను రూ. 3 వేలకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ పాలిస్తున్న ఛత్తీస్‌గఢ్‌లో క్వింటాల్ వడ్లను రూ. 3 వేలకు కొంటున్నామని తెలిపారు. ఇది తప్పని తేలితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, నిజమైతే మంత్రితో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. తెలంగాణలో అందరికీ దళితబంధు ఇవ్వడం చేతకాలేదు కానీ.. కేసీఆర్ దేశవ్యాప్తంగా ఇస్తానంటున్నారని మండిపడ్డారు. గుండాల మండలంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టలేదన్నారు. ఏం చేయకున్నా బీఆర్ఎస్ మాత్రం సమ్మేళనాలు చేసుకుంటోందని విమర్శించారు. వేల కోట్లు సంపాదించిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదారి కిశోర్, మంత్రి కనీసం ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర యాదాద్రి జిల్లాలో అడుగు పెట్టిన తర్వాత ఆలేరులో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు ఆలేరు మండలం పటేల్‌గూడెంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ధాన్యం కొనుగోలు సెంటర్లను పరిశీలించారు. ఆయన వెంట టీపీసీసీ జనరల్ సెక్రటరీ బీర్ల అయిలయ్య, జనగాం ఉపేందర్‌రెడ్డి ఉన్నారు.