- భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నార్కట్పల్లి, వెలుగు : ‘‘నేను చెప్పిన వారికే అధిష్ఠానం టికెట్ ఇస్తుంది. ఎవరూ అధైర్య పడవద్దు..”అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యకర్తలకు భరోసా కల్పించారు. శనివారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని తమ సొంతూరు బ్రాహ్మణ వెల్లంలలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.. నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన పోటీ చేస్తారు..ఆయన పోటీ చేస్తారు అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దు అన్నారు. నకిరేకల్ లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా పని చేసిన తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఏనాడు ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. సొంత ఆస్తులను కూడబెట్టుకోవడానికే మొగ్గు చూపారని తెలిపారు.
నకిరేకల్ నియోజకవర్గం తనకు రెండో కన్ను లాంటిదని, అభివృద్ధి కోసం పార్టీ మారినా అనేటోడు రూ.300కోట్లు తెచ్చి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయాడని ఎద్దేవా చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు పూర్తి టైం కేటాయిస్తానని చెప్పారు. నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాలు తనకు రెండు కండ్లలాంటివన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య గౌడ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు దైద రవీందర్, వేదాసు శ్రీధర్, ప్రసన్న రాజ్, వడ్డే భూపాల్ రెడ్డి, జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి నల్గొండలో అన్ని సీట్లు మావే..
నల్గొండ అర్బన్, వెలుగు : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లకు 12 గెలస్తామని, రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే రూ.2 లక్షల రుణమాఫీపైనే మొదటి సంతకం పెడ్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. నల్గొండ మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీకి చెందిన 200 మంది నాయకులు, కార్యకర్తలు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ నల్గొండ టౌన్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, వెలుగుపల్లి మాజీ సర్పంచ్ జూలకంటి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.