చంపడానికైనా చావడానికైనా సిద్ధం.. 75 నుంచి 80 సీట్లు గెలుస్తం

  • కార్యకర్తలను కాపాడుకోవడానికి   ఏమైనా చేస్తా 
  • నేను మిస్డ్​కాల్​ ఇస్తే రాష్ట్ర సీఎం ఎవరైనా రావాల్సిందే 
  • ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నల్గొండ అర్భన్/ నార్కట్​పల్లి, వెలుగు : ఐదు సార్లు గెలిపించిన వారికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని, కార్యకర్తల కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధమని కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. మంగళవారం ఎంపీ బర్త్​డే వేడుకలను నార్కట్​పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కట్​పల్లి నుంచి వెల్లెంల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వెల్లంల  ప్రాజెక్టులో కృష్ణ జలాలకు చీర, సారె, కుంకుమను సమర్పించి పూజలు చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి మీటింగ్​వద్ద కేక్​ కట్​ చేసి మాట్లాడారు. వచ్చే మూడు నెలలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడాలని, అందరి సహకారంతో రాష్ట్రంలో 75 నుంచి 80 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. అసలు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఉన్నాడా అని ప్రశ్నించారు.

ఉమ్మడి రాష్ట్రంలో పవర్ ఫుల్ సీఎం వైఎస్​ రాజశేఖర్​ రెడ్డినే బ్రాహ్మణ వెల్లంలకు మూడుసార్లు తీసుకువచ్చానని, రాష్ట్రంలో ఎవరు సీఎం అయినా తాను మిస్డ్ కాల్ ఇస్తే హెలికాప్టర్​లో రావాల్సిందేనన్నారు. బ్రాహ్మణ వెల్లంలలో మోటార్లు బిగించకుండా అధికారులను ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారని, వచ్చే ఎన్నికల తర్వాత ఈ ఎమ్మెల్యేలు మాజీలై బస్టాండ్లలో బఠానీలు అమ్ముకుంటారని ఎద్దేవా చేశారు. డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, పటేల్ రమేశ్​రెడ్డి, బీర్ల ఐలయ్య, కుంభ అనిల్ కుమార్ రెడ్డి, దైద రవీందర్, వేదాసు వెంకయ్య, వంగూరు లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి, బత్తుల ఉషయ్య గౌడ్, జూలకంటి సైదిరెడ్డి పాల్గొన్నారు.