కరోనా మరణాల విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారు

కరోనా మరణాల విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారు

యాదాద్రి: రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టులు చేయకుండా మరణాలను కూడా తక్కువగా చేసి ప్రజలను మోసం చేస్తోందని భువనగిరి ఎంపీ కోమటరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. గాంధీ హాస్పిటల్ లో మంచిగా ఉన్న పేషెంట్లతో మాట్లాడి సీఎం కేసీఆర్ నాటకాలు ఆడారని ఫైర్ అయ్యారు. ఇది డ్రామాలకు సమయం కాదన్నారు. కేసీఆర్ కు మానవత్వం లేదని.. కరోనా కోసం ఎంత పైసలైనా ఖర్చు పెడతానని చెప్పి కనీసం టెస్ట్ లు కూడా చేయట్లేదని విమర్శించారు. 'గాంధీ ఆస్పత్రిలో రోజుకు 70 మంది చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం 30 నుంచి 40 మరణాలుగా చూపిస్తోంది. కరోనాను వెంటనే ఆరోగ్య శ్రీ చేర్చాలి. ఆంధ్రప్రదేశ్ లో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందిస్తుంటే.. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తప్పుడు లెక్కలతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది. దేశంలోనే మనది రెండో ధనిక రాష్ట్రమని చెప్పే కేసీఆర్.. ప్రజలను నాలుగు కోట్ల అప్పుల ఊబిలో చిక్కుకునేలా చేశారు' అని వెంకట రెడ్డి దుయ్యబట్టారు.