ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. బీఆర్ఎస్ కు రాజీనామ చేసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యకర్తలతో భేటీ కావడం సంచలనం రేపుతోంది. ఆగస్టు 26 శనివారం తన వ్యవసాయ క్షేత్రంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దని కోమటిరెడ్డి తెలిపారు. నకిరేకల్ లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు.. ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. సొంత ఆస్తులను కూడబెట్టుకోవడానికే ఇతర పార్టీలో నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించేంతవరకు తన పూర్తి సమయం ఇక్కడే కేటాయిస్తానని చెప్పారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు చిరుమర్తి లింగయ్యను గెలిపిస్తే.. కాంగ్రెన్ ను నట్టెట్లో ముంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయాడని కోమటిరెడ్డి విమర్శించారు. అదీకాక కాంగ్రెస్ కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెట్టించాడని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ లోకి వెళ్లిన అంటూ.. పెద్ద ఫామ్ హౌస్ కట్టాడని, భూ కబ్జాలకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు.
నిన్న, మొన్నటి వరకు టికెట్ కోసం ఎదురుచూసి నేడు పార్టీ మారుదామని అని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం చూస్తున్నాడని కోమట్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 28తేదీ సోమవారం నిర్వహించే సమావేశంలో కార్యకర్తల అభిప్రాయం మేరకే పార్టీ అభ్యర్థిని సెలెక్ట్ చేస్తుందని వెంకట్ రెడ్డి ప్రకటించారు.