అభ్యుదయ భావాలు ఉన్న వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నకిరేకల్ లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలతో చర్చించిన తర్వాతనే వేముల వీరేశంను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నామని చెప్పారు. నకిరేకల్ లో 50 వేల మెజార్టీతో వేముల వీరేశం గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కలిశారు. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలతో కోమటిరెడ్డితో కలిసి వేముల వీరేశం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకట్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ప్రతి సీటు అవసరం అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు భూములను అమ్మి.. కేసీఆర్ పథకాలకు పైసలు ఇస్తున్నారని ఆరోపించారు. దళిత బంధులో ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారని స్వయంగా సీఎం కేసీఆరే అన్నారని చెప్పారు. టీఎస్పీఎస్సీలో సిట్ ఆఫీసర్ గా ఉన్న ఏఆర్ శ్రీనివాస్ ను బదిలీ చేశారని అన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురించి మాట్లాడటం వృథా అన్నారు. సూర్యాపేటలో ఈసారి మంత్రి జగదీష్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 స్థానాలు కాంగ్రెస్ గెలవబోతుందని జోస్యం చెప్పారు. జగదీష్ రెడ్డికి ఆయన అనుచర వర్గానికి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని హెచ్చరించారు. గతంలో స్కూటర్ కూడా లేని మంత్రి జగదీష్ రెడ్డి ఈరోజు వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.
కోమటిరెడ్డి నాయకత్వంలో పని చేస్తా : వేముల
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు వేముల వీరేశం. ఈరోజు నుంచి కోమటిరెడ్డి డైరెక్షన్ లోనే పని చేస్తానని అన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు కోసం స్థానికంగా ఉన్న శ్రేణులను కలుపుకొని ముందుకెళ్తానన్నారు.