నల్గొండ అర్బన్, వెలుగు: సోనియాగాంధీ అనుకుంటే తాను సీఎం అవుతానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. సోమవారం నల్గొండ మండలంలోని కంచనపల్లి, దీపకుంట, రాములబండ, దోమలపల్లి, నర్సింగ్ భట్ల, పాతూరు, చెన్నూగూడెం, దొనకల్లు, గుండ్లపల్లి తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలలో సీఎం కేసీఆర్ నియంత పాలన అంతమై.. ఇందిరమ్మ రాజ్యం రాబోతుందన్నారు.
తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగు పడలేదన్నారు. ఉద్యమకారులకు అన్యాయం చేసి.. ఉద్యమ ద్రోహులంతా పంచన చేర్చుకున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీ పథకాలను అమలుపై నిర్ణయం తీసుకుంటామని, 100 రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి శ్రీకారం చుడతామని చెప్పారు.
రైతులకు 24 గంటల కరెంట్ అమలు పచ్చి బూటకమని సబ్‌స్టేషన్లలో లాగ్‌బుక్‌లు చూస్తే తెలుస్తందన్నారు. నల్గొండలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, కనీసం గుంటలు పడ్డ రోడ్డుకు మట్టి పోసిన దిక్కులేదన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, ఎంపీపీ మనిమద్దే సుమన్, నేతలు జానయ్య, మర్రి జానయ్య, కొప్పు నవీన్ గౌడ్, మర్రి మల్లయ్య, దండు ఎల్లయ్య, జయ కుమార్, ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read:-మళ్లీ బీఆర్‌ఎస్‌దే అధికారం : గొంగిడి సునీత