ప్రభుత్వం వెంటనే ఫార్మా సిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతులు పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమం ఫార్మా సిటీ ప్రతిపాదిత గ్రామం మేడిపల్లి నుంచి ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం వరకు జరుగుతుంది. మంగళవారం ప్రారంభమైన ఈ పాదయాత్ర ఇవాళ ఇబ్రహీంపట్నం చేరుకుంది. ఇక్కడ పాదయాత్ర ప్రారంభం కాగానే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వచ్చి రైతులకు సంఘీభావం తెలిపారు. రైతులతో కలిసి కొంత దూరం ఆయన నడిచారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి కోట్ల రూపాయలకు ఫార్మా కంపెనీలకు అమ్ముకుంటోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసిన చోట కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఒకే చోట వందల కంపెనీలు ఏర్పాటు చేస్తే.. హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరూ ఉండలేరని తెలిపారు. పార్టీలకతీతంగా పోరాటం చేయాలని సూచించారు.