హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు వరుసగా పాదయాత్రల బాట పడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈనెల 20 నుంచి బ్రాహ్మణ వెళ్ళంల, SLBC ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న డిమాండ్ తో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ నెల 20 నుంచి 26 వరకు పాదయాత్ర చేయడానికి అనుమతివ్వాలని కోరుతూ ఎన్నికల సంఘంతో పాటు SPకి ఆయన లేఖ రాశారు. పాదయాత్రకు ప్రాజెక్టుల సాధన యాత్ర అని పేరు పెట్టారు.
TRS ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. 2008లో బ్రాహ్మణవెళ్లంల ప్రాజెక్టు ను కాంగ్రెస్ ప్రారంభించిందని, రూ.100 కోట్లు ఇస్తే ఇది పూర్తవుతుందని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు SLBC సొరంగ మార్గానికి రూ.1300 కోట్లు ఖర్చు చేసిందని, మరో వెయ్యికోట్లు ఇస్తే ఇది పూర్తవుతుందని చెప్పారు. SLBC సొరంగ మార్గం కంప్లీట్ అయితే జగన్… ఏపీకి నీరు తీసుకెళ్లే వాడు కాదన్నారు. కాంగ్రెస్ తో పాటు తనకు పేరు వస్తుందనే ఈ ప్రాజెక్టులను ఏడేళ్ల నుంచి పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు. TRS ప్రభుత్వ తీరుకు నిరసనగా 6 రోజులు 120 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానన్నారు కోమటిరెడ్డి.