యాదాద్రి : రైతుబంధు పూర్తిస్థాయిలో ఎప్పుడు ఇస్తారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఈమేరకు ఆయన సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ‘మీ మాటలు కోటలు దాటుతాయి. పనులు గేటు కూడా దాటవు. దీనికి నిదర్శనమే రైతుబంధు డబ్బుల జమ. ఈఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. కానీ, రైతుబంధు మాత్రం పూర్తిస్థాయిలో అందలేదు. బ్యాంకు అకౌంట్ లో డబ్బులు ఎప్పుడు పడతాయి? మెసేజ్ వచ్చి సెల్ ఫోన్ ఎప్పుడు మోగుతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు’ అని వెంకట్రెడ్డి వాపోయారు.
గప్పాలు కొట్టుడు కాదు
‘ఈఏడాది రైతుబంధు కింద దాదాపు 70 లక్షల మంది అర్హులుగా ఉన్నారు. మొత్తం రూ.7,720.29 కోట్ల నిధులు అవసరమని అంచనా. మరి, అందరికీ ఎప్పుడు జమచేస్తారు. రైతు ప్రభుత్వం అని గప్పాలు కొట్టుకోవడం కాదు. రైతు బంధుపూర్తిస్థాయిలో ఎప్పుడిస్తారో చెప్పండి. రైతుబంధు పేరుతో ప్రభుత్వం ఒకవైపు డబ్బులు వేస్తూనే.. మరోవైపు బ్యాంకులలో రుణాలు చెల్లించాలనే కారణంతో రైతుల ఖాతాలను హోల్డ్ లో ఉంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయలేదు. దీంతో బ్యాంకుల్లో వడ్డీలు పెరిగి అన్నదాతల అప్పులు రెట్టింపయ్యాయి. మిగిలిన రైతులకు కూడా రైతుబంధు నగదును వెంటనే జమ చేయాలి. లేదంటే రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం’ అని కోమటిరెడ్డి వార్నింగ్ఇచ్చారు.