వచ్చే కాంగ్రెస్ ​సర్కార్​లో ముఖ్య నేత నేనే : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

  • వచ్చే కాంగ్రెస్ ​సర్కార్​లో ముఖ్య నేత నేనే
  • తొలి సంతకం రుణమాఫీపైనే
  • ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

యాదాద్రి : రాష్ట్రంలో ఏర్పడబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, సర్వేలన్నీ అదే విషయం చెబుతున్నాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను ముఖ్యనేతనని అన్నారు. శనివారం (ఆగస్టు 12న) భువనగిరిలో మీడియాతో మాట్లాడారు. 

గ్రూప్–2 పరీక్షలను ఆదరబాదరగా పెట్టి నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. గ్రూప్-–2 పరీక్ష పోస్ట్ పోన్​చేయాలన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై రూ.50 వేల కోట్లు వస్తున్నదని,ఆసరా పింఛన్ రూ.4 వేలు ఇవ్వడం పెద్ద లెక్క కాదని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ సర్కారు భూములను విచ్చలవిడిగా అమ్మేస్తోందన్నారు. ఆ పైసలన్నీ ఎటుపోతున్నాయో ప్రజలకు తెలుపడం లేదన్నారు. ఈనెల 16, 17 తర్వాత బస్సుయాత్ర మొదలుపెడతామని తెలిపారు. 

వడగండ్ల వానకు పంట నష్టం జరిగితే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఐదు లక్షల మంది టీఆర్టీ (టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్ ) కోసం ఎదురు చూస్తున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2, 3 నెలల్లో టీఆర్టీ నిర్వహిస్తామని వెంకట్ రెడ్డి భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాతీలకు నిధులు ఇవ్వడం లేదన్నారు. 24 గంటలు కరెంటుపై ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్దాలేనని పేర్కొన్నారు.