కాంగ్రెస్ హయాంలోనే సమాఖ్య స్ఫూర్తి ప్రమాదంలో పడింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ హయాంలోనే సమాఖ్య స్ఫూర్తి ప్రమాదంలో పడింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

 

  • లోక్ సభలో ఎంపీకొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్య
  • బ్యాంకింగ్ బిల్లుపై విపక్షాల మధ్యే స్పష్టత లేదని ఎద్దేవా

న్యూఢిల్లీ, వెలుగు: బ్యాంకింగ్ రంగానికి సంబంధించి సమాఖ్య స్ఫూర్తి కాంగ్రెస్ హయాంలోనే ప్రమాదంలో పడిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కానీ నిందను మాత్రం బీజేపీపై వేస్తున్నారని ఆరోపించారు. 2011లో కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన 97 కార్పోరేటీవ్ అమైండ్మెంట్ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని గుర్తుచేశారు. అందువల్లే ఈ బిల్లును సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేసిందని వివరించారు.  మంగళవారం ‘ది బ్యాంకింగ్ లాస్ అమైండ్మెంట్ బిల్లు – 2024’పై లోక్ సభలో జరిగిన చర్చలో  ఎంపీ పాల్గొన్నారు. 

ది బ్యాంకింగ్ లాస్ అమైండ్మెంట్ బిల్లును ఈ ఏడాది ఆగష్టులో కేంద్రం ప్రవేశపెట్టిందని చెప్పారు. బ్యాంకింగ్ సెక్టార్ లో సంస్కరణలకు ఇది దోహదపడుతుందన్నారు.  ఈ బిల్లుపై విపక్షాల మధ్యే భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తుంటే, టీఎంసీ మాత్రం స్వాగతిస్తుందన్నారు. కో–ఆపరేటీవ్ బ్యాంక్ లు అనేవి రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, అందువల్ల ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తిపై దాడి చేసేలా ఉందని కాంగ్రెస్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. అయితే, 1969 లో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాత్రికి రాత్రే బ్యాంకులను నేషలైజేషన్ చేసిందని గుర్తుచేశారు. పీవీ నర్సింహా రావు ప్రధానిగా ఉన్న టైంలో బ్యాంకులను లిబరలైజేషన్ లో భాగంగా తిరిగి ప్రైవేటీకరించారని చెప్పారు. బ్యాంకుల విషయంలో నేషనలైజేషన్, లిబరలైజేసన్ చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీకే స్పష్టత లేదని విమర్శించారు.