
- నా గెలుపు దుబ్బాక ప్రజలకే అంకితం
దుబ్బాక, వెలుగు: దుబ్బాక లో తన విజయం ప్రజలకే అంకితమని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర రెడ్డి అన్నారు. ఆదివారం కౌంటింగ్ కేంద్రంలో విజయ ధృవీకరణ పత్రాన్ని అందుకుని మీడియా తో మాట్లాడారు. కత్తి పోటుకు గురై 25 రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలే తనకు అండగా ఉండి ఎమ్మెల్యే గా గెలిపించారని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు ప్రజలతో కలిసి పోరాడుతానని చెప్పారు. తన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంటానని హామీ ఇచ్చారు. ఏ ఆలోచనతోనైతే దుబ్బాక ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా దుబ్బాక అభివృద్ధి కోసం రాజీలేని అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.