
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులతో పాటు గతంలో కాంగ్రెస్ ఏం చేసిందో.. గత పదేండ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో తెల్చుకుందామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.
‘‘ఎవరు ఏం చేశారనే దానిపై చర్చకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్ధమా? తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అడిగినా.. అడగకపోయినా కేంద్రం నుంచి నిధులు వస్తాయి. 2014లో రూ.2 లక్షలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.12 లక్షల వరకు పెంచారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని 29 % నుంచి 11 శాతానికి తగ్గించిన ఘనత బీజేపీకే దక్కింది. ఇవన్నీ కాంగ్రెస్, బీఆర్ఎస్కు కనిపించడం లేదా?” అని ప్రశ్నించారు.
నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు కాంగ్రెస్కు కంచుకోటలాగా మెదక్ ను చెప్పుకున్నారని, కానీ ఏండ్ల తరబడి అధికారంలో ఉన్నా రైలు మార్గం వేయలేదని విమర్శలు చేశారు. కానీ, తాము త్వరలో రైలును ప్రారంభించబోతున్నామని చెప్పారు.