హైదరాబాద్ , వెలుగు : గ్రామం నుంచి ఒకే కులానికి చెందిన 80 కుటుంబాలను బహిష్కరించిన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్ విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ (వీడీసీ)పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గ్రామ బహిష్కరణను ఆయన బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
వీడీసీ అనుమతి లేకుండా ఒక కుటుంబం కరెంట్ మీటరు తీసుకున్నదన్న నెపంతో సదరు కులానికి చెందిన అన్ని కుటుంబాలపై గ్రామ బహిష్కరణ విధించడం మంచి పద్ధతి కాదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి అన్నారు. వీడీసీ కట్టుబాట్లను ఒక కుటుంబం పాటించకపోతే... 80 కుటుంబాలపై చర్య తీసుకోవడం, అది కూడా కులం పేరుతో చర్య తీసుకోవడం సమాజంలో తప్పుడు సంకేతాలు పంపిస్తుందని ఆయన పేర్కొన్నారు.