- ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి మోదీ
- బీసీని సీఎం చేసేందుకు బీసీలంతా ఏకం కావాలి
- బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పిలుపు
కామారెడ్డి టౌన్, వెలుగు: ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తానని మోదీ ప్రకటించారని గుర్తుచేశారు. బీసీ సీఎం కోసం బీసీ సంఘాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి ఏపీలో14 మంది సీఎంలుగా పని చేస్తే బీసీలకు ఒక్కసారి కూడా అవకాశం రాలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా అదే పరిస్థితి ఉందన్నారు. 52 శాతం జనాభా ఉన్న బీసీలకు కనీసం జనాభా ప్రాతిపదికన మంత్రి పదవులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ‘మేం పాలిస్తాం.. మీరు బానిసలుగా ఉండండి’ అని అన్నట్లు అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తప్ప ఏ పార్టీ బీసీ సీఎం హామీ ఇవ్వలేదని, బీసీలంతా బీజేపీకి మద్దతు తెలపాలని కోరారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు34 శాతం రిజర్వేషన్ఉంటే దాన్ని 23 శాతానికి తగ్గించారన్నారు. ఇలాంటి పార్టీలు తమకు ఏం న్యాయం చేస్తాయని ప్రశ్నించారు. కనీసం ఎన్నికల్లో బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వడం లేదని, అలాంటి పార్టీలకు ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. రాజకీయంగా ఎదిగే అవకాశం బీజేపీ ఇస్తోందని, జార విడుచుకోవద్దన్నారు. సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు భాస్కర్, స్థానిక లీడర్లు నీలం చిన్న రాజులు, ఆకుల భరత్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.